Telangana: ముగిసిన నామినేషన్ల గడువు.. మొత్తం 3,584 దాఖలు.. నేడు పరిశీలన

  • 22 వరకు ఉప సంహరణకు గడువు
  • అత్యధికంగా కాంగ్రెస్ నుంచి 135 దాఖలు
  • ఉప సంహరణ అనంతరం బ్యాలెట్ ప్రకటన

ఎన్నికలకు సిద్ధమవుతున్న తెలంగాణలో కీలక ఘట్టమైన నామినేషన్ల పర్వం సోమవారంతో ముగిసింది. మొత్తం 119 అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను 3,584 నామినేషన్లు దాఖలైనట్టు ఎన్నికల ప్రధాన అధికారి రజత్ కుమార్ తెలిపారు. మొత్తం దాఖలైన నామినేషన్లలో సోమవారం ఒక్క రోజే ఏకంగా 2,087 నామినేషన్లు దాఖలు కావడం విశేషం. ఈ నెల 12న నామినేషన్ల స్వీకరణ ప్రారంభమై 19తో ముగిసింది. చివరి రెండు రోజుల్లోనే పెద్ద ఎత్తున నామినేషన్లు దాఖలయ్యాయి. టికెట్ల కోసం చివరి వరకు వేచి చూసిన వారు చివరి రోజున స్వతంత్ర అభ్యర్థులుగా నామినేషన్లు వేశారు.

దాఖలైన మొత్తం నామినేషన్లను నేడు పరిశీలించనున్న అధికారులు.. నిబంధనలకు విరుద్ధంగా ఉన్నవాటిని తిరస్కరించనున్నారు. అలాగే, 22న మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్లను ఉపసంహరించుకోవచ్చు. అనంతరం బరిలో ఉన్న అభ్యర్థులతో కూడిన బ్యాలెట్‌ను అధికారులు ప్రకటిస్తారు.  

కాంగ్రెస్ 135, బీజేపీ 128, టీఆర్ఎస్ 116, టీడీపీ 20, ఎంఐఎం 13, సీపీఎం 28, సీపీఐ 3, ఎన్‌సీపీ 21, బీఎస్పీ 112, స్వతంత్రులు, ఇతరులు కలిపి 1,511 నామినేషన్లు దాఖలు చేసినట్లు ఎన్నికల అధికారి రజత్ కుమార్ వివరించారు. అలాగే, ముషీరాబాద్ 48, మలక్‌పేట 36, అంబర్‌పేట 56, ఖైరతాబాద్‌ 55, జూబ్లీహిల్స్‌ 51, సనత్‌నగర్‌ 37, నాంపల్లి 42, కార్వాన్‌ 31, గోషామహల్‌ 43, చార్మినార్‌ 25, చాంద్రాయణగుట్ట 34, యాకత్‌పురా 37, బహదూర్‌పురా 19, సికింద్రాబాద్‌ 56, కంటోన్మెంట్ నుంచి 47 నామినేషన్లు దాఖలైనట్టు తెలిపారు. ఇప్పటి వరకు  ఆరు రాజకీయ పార్టీలకు చెందిన మేనిఫెస్టోలు తమకు అందినట్టు చెప్పారు. రాష్ట్రంలో మొత్తం 2,80,64,683 మంది ఓటర్లు ఉన్నారన్నారు.

Telangana
Elections
Nominations
TRS
BJP
Congress
Telugudesam
Rajath Kumar
  • Loading...

More Telugu News