Yadadri Bhuvanagiri District: సేవా దృక్పథం, ధైర్యం ఉన్న పాలకులు రావలి : సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ
- ప్రతి ఒక్కరూ స్వార్థాన్ని విడనాడితేనే సమాజంలో ప్రగతి
- వైద్యం అందక మనుషులు చనిపోయే పరిస్థితులు పోవాలి
- చావా ఫౌండేషన్ సేవలు అభినందనీయం
సేవా దృక్పథం, పరిస్థితులను ధైర్యంగా ఎదుర్కొనే తత్వం ఉన్న వారు పాలకులుగా రావాల్సిన అవసరం నేటి సమాజానికి ఉందని సీబీఐ మాజీ జేడీ వి.వి.లక్ష్మీనారాయణ ఆకాంక్షించారు. లాభాపేక్ష లేని ధోరణి సమాజంలో మొగ్గతొడగాలన్నారు. పల్లెపల్లెకు వైద్యం లక్ష్యంతో 'చావ ఫౌండేషన్' సౌజన్యంతో ఆర్కే ఆస్పత్రులు నిర్వహిస్తున్న ఉచిత వైద్య శిబిరాలు యాభై పూర్తయిన సందర్భంగా భువనగిరిలో అభినందన సభ జరిగింది. ఈ సభకు ముఖ్య అతిథిగా విచ్చేసిన లక్ష్మీనారాయణ మాట్లాడారు.
సమాజంలో వైద్యం అందక ఎంతో మంది చనిపోతున్నారని, ఇటువంటి పరిస్థితులు ఉండకూడదన్నారు. ప్రభుత్వాలు ప్రజలకు వైద్య సేవలందించేందుకు ఆస్పత్రులు ఏర్పాటు చేస్తున్నా అవి పూర్తి స్థాయిలో అవసరాలు తీర్చలేకపోతున్నాయని అభిప్రాయపడ్డారు. ఈ పరిస్థితుల్లో ప్రైవేటు వైద్యులు సామాజిక బాధ్యతగా చిత్తశుద్ధితో సేవలందించేందుకు ముందుకు రావాలని సూచించారు.
స్వప్రయోజనాలను అన్నివర్గాలు విడనాడితే సమాజానికి మేలు జరుగుతుందని చెప్పారు. ఇందుకోసం ప్రకృతి నుంచి మనిషి నేర్చుకోవాల్సిన అంశాలు ఎన్నో ఉన్నాయని అన్నారు. ఆర్కే ఆస్పత్రుల నిర్వాహకుడు డాక్టర్ రాజ్‌కుమార్ మాట్లాడుతూ 50 ఉచిత వైద్య శిబిరాల ద్వారా 10 వేల మందికి సేవందించినట్లు తెలిపారు. ఫౌండేషన్ చైర్మన్ చావ లింగారావు తదితరులు పాల్గొన్నారు.