Andhra Pradesh: అమరావతి కోసం ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టలేదు.. ఒక్క ఐడియాతో 35,000 ఎకరాలు సేకరించాం!: చంద్రబాబు
- రైతులకు నేను మాటిచ్చాను
- నన్ను నమ్మి భూములు అప్పగించారు
- అమరావతిలో మీడియాతో మాట్లాడిన సీఎం
అమరావతి ప్రాంతంలో తనను నమ్మి రైతులు భూములను అప్పగించారని ఏపీ సీఎం చంద్రబాబు తెలిపారు. ‘మీ భూములు నాకు ఇవ్వండి. ఇప్పుడు మీరు సంపాదిస్తున్న దాని కంటే ఎక్కువ ఆదాయం వచ్చే మార్గం నేను చూపిస్తా’ అని రైతులకు చెప్పానని బాబు అన్నారు. దానికి రైతులందరూ సంతోషంగా అంగీకరించారని పేర్కొన్నారు. అమరావతికి ఏపీ ప్రభుత్వం రూపాయి కూడా ఖర్చు పెట్టలేదన్నారు. కేవలం ఓ ఐడియాతోనే ఈ అద్భుతం సాధ్యమయిందనీ, 35,000 ఎకరాలను సేకరించగలిగామని వ్యాఖ్యానించారు. అమరావతిలో ఈ రోజు ‘జయహో బీసీ’ సభ పోస్టర్ ఆవిష్కరించిన అనంతరం చంద్రబాబు మీడియాతో మాట్లాడారు.
అమరావతిలో రైతులు ఇచ్చిన భూముల విలువ అప్పట్లోనే రూ.40,000-50,000 కోట్లు ఉండేదని చెప్పారు. ఇందులో 20-30 శాతం భూమిని రైతులకు తిరిగి ఇచ్చామన్నారు. అమరావతిలో ప్రస్తుతం ప్రపంచంలోనే ఎక్కడా లేనంత అత్యాధునిక మౌలిక వసతులను ఏర్పాటు చేస్తున్నామన్నారు. విద్యుత్, నీళ్లు, వరద ప్రవాహం వ్యవస్థలను భూగర్భంలో నిర్మిస్తున్నామని తెలిపారు. ఏపీలో పరిపాలన భవనం 1650 ఎకరాల్లో నిర్మిస్తున్నామనీ, ఇలాంటి వసతి ప్రపంచంలో ఎక్కడా లేదని వ్యాఖ్యానించారు. ఈ నెల 30న రాజమహేంద్ర వరం(రాజమండ్రి)లో భారీ ఎత్తున జయహో బీసీ సభను నిర్వహించేందుకు టీడీపీ నేతలు ఏర్పాట్లు చేసుకుంటున్నారు.