Hyderabad: ఆమ్లెట్ వేయలేదని భార్యతో గొడవ.. మనస్తాపంతో ఉరేసుకున్న భర్త

  • హైదరాబాద్ కేపీహెచ్‌బీలో ఘటన
  • తాగొచ్చి ఆమ్లెట్ వేయమన్న భర్త
  • కుదరదనడంతో ఉరేసుకుని ఆత్మహత్య

అడిగినా ఆమ్లెట్ వేయలేదన్న మనస్తాపంతో ఓ వ్యక్తి  ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన హైదరాబాద్‌లోని కేపీహెచ్‌బీ కాలనీలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. రేవడ మహేశ్(24)-వనజ భార్యాభర్తలు. స్థానికంగా రోడ్డు నంబరు-1లో నివసిస్తున్నారు. వాచ్‌మన్‌గా పనిచేస్తున్న మహేశ్ మంగళవారం రాత్రి ఫుల్లుగా మందుకొట్టి ఇంటికొచ్చాడు.

తాగిన మత్తులో ఉన్న మహేశ్ తనకు కోడిగుడ్డు అట్టు వేసి ఇవ్వాలని భార్యను కోరాడు. అందుకామె నిరాకరించడంతో ఇద్దరి మధ్య వాగ్వివాదం జరిగింది. కాసేపటి తర్వాత ఇంటి యజమాని వద్దకు వెళ్లిన వనజ భర్తతో జరిగిన గొడవ గురించి చెప్పింది. చాలాసేపటి వరకు అక్కడే ఉన్న ఆమె తర్వాత ఇంటికి వచ్చి చూడగా తలుపు వేసి ఉంది. చాలా సేపటి వరకు తలుపు తట్టినా తీయకపోవడంతో అనుమానంతో పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి వచ్చిన పోలీసులు తలుపు బద్దలు కొట్టి చూడగా లోపల మహేశ్ ఉరికి వేలాడుతూ కనిపించాడు. వెంటనే అతడిని కిందికి దించి చూశారు. అయితే, అప్పటికే అతడు మృతి చెందినట్టు పోలీసులు నిర్ధారించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Hyderabad
KPHB
Suicide
Crime News
  • Loading...

More Telugu News