Hyderabad: రెండేళ్లుగా లాటరీ పేరు చెబుతూ పదేపదే మోసం... ఇంట్లో ఎవరికీ చెప్పకుండా డబ్బిస్తూనే వచ్చిన మహిళ!

  • హైదరాబాద్ లో వెలుగులోకి వచ్చిన ఘరానా సైబర్ మోసం
  • మహిళను పలుమార్లు మోసం చేసిన ఆగంతుకుడు
  • రూ. 20 లక్షలు పోయిన తరువాత బోరుమన్న మహిళ

ఒకరిని ఒకసారి మోసం చేయడం సులువు. రెండో సారి అదే పని చేయాలంటే కాస్తంత కష్టమే. అయితే, పక్కనున్నది చెప్పింది చెప్పినట్టు నమ్మే వాళ్లయితే... ఈజీనే! నైజీరియన్ సైబర్ మోసగాళ్లకు అలాగే దొరికిపోయిందో హైదరాబాద్ మహిళ. లాటరీ వచ్చిందని, కారు వచ్చిందని, దాన్ని పంపుతుంటే ప్రమాదం జరిగిందని... ఇలా చెబుతూ గడచిన రెండేళ్లుగా డబ్బులు గుంజుతుంటే, ఇంట్లో భర్తకు, బిడ్డకు తెలియకుండా డబ్బులు పంపిస్తూ వచ్చిందా మహిళ. చివరకు రూ. 20 లక్షలు పోగొట్టుకున్నాక, విషయం తెలుసుకున్న కుమారుడు, తల్లిని మందలించి, పోలీసులకు ఫిర్యాదు ఇప్పించాడు.

మరిన్ని వివరాల్లోకి వెళితే, సికింద్రాబాద్ లో ఉంటున్న మహిళకు రెండేళ్ల క్రితం రూ. 10 లక్షల లాటరీ వచ్చిందని, దాన్ని తీసుకోవాలంటే, రూ. 10 వేలు జమ చేయాలని ఫోన్ వచ్చింది. ఆమె ఆ డబ్బును చెప్పిన ఎకౌంట్ కు ట్రాన్స్ ఫర్ చేసింది. ఆపై డబ్బు కోసం అదే నంబరును సంప్రదించగా, అది పని చేయలేదు. ఆమె ఆ విషయాన్ని ఎవరికీ చెప్పకుండా వదిలేసింది. మరో మూడు నెలల తరువాత ఇంకో వ్యక్తి ఫోన్ చేసి, రూ. 25 లక్షల లాటరీ వచ్చిందని చెబుతూ, అవి రావాలంటే రూ. 2 లక్షలు జమ చేయాలని చెప్పాడు. ఆమె ఆ డబ్బు బదిలీ చేసింది. ఆపై రెండు నెలలకు మరో 3 లక్షలు వేస్తే, వెంటనే డబ్బు వస్తుందని నమ్మబలికితే నమ్మింది. డబ్బు రాలేదని ఆమె తెలుసుకున్నా, మోసపోయానని బాధపడి, ఈ విషయాన్ని ఎవరికీ చెప్పలేదు.

ఆపై ఏడాదిన్నరకు మరోసారి ఫోన్ వచ్చింది. గతంలో మీకు రూ. 25 లక్షల లాటరీ వచ్చిందని, దాని కోసం రూ. 5 లక్షలు చెల్లించారని ఆనవాళ్లు చెప్పాడు. తాజాగా మీకు కారు బహుమతి వచ్చిందని చెబుతూ, కారును పంపుతున్నామని అంటూ అడ్రస్, ఫోన్ నంబర్ కనుక్కున్నాడు. నాలుగు రోజుల తరువాత ఫోన్ చేసి, కారును పంపిస్తుంటే యాక్సిడెంట్ అయిందని, కొత్త కారును పంపిస్తున్నామని, పది రోజుల్లో అది చేరుతుందని చెప్పాడు.

"అప్పట్లో రూ. 5 లక్షలిచ్చిన మీరు రూ. 25 లక్షలూ తీసుకోలేదుగదా? కారుతో పాటు ఆ 5 లక్షలను పంపుతున్నాను. అవి మీ ఖాతాలోకి చేరాలంటే రూ. 20 లక్షల నగదు నిల్వ ఉండాలి" అని చెప్పాడు. తన వద్ద రూ. 15 లక్షలే ఉన్నాయని చెప్పిన ఆమె, ఆ డబ్బును బ్యాంకు ఖాతాలో వేసింది. రూ. 5 లక్షలు ఖాతాలో వేస్తున్నామని చెప్పిన ఆ వ్యక్తి, బ్యాంకు ఖాతా, పాస్ వర్డ్ ఇవ్వాలని కోరగా, ఆమె ఇచ్చింది.

ఆపై ఈ నెల 5, 6, 7 తేదీల్లో మొత్తం డబ్బునూ కాజేశాడు ఆగంతుకుడు. సోమవారం నాడు బాధితురాలు బ్యాంకుకు వెళ్లగా, విషయం తెలుసుకుని అతని నంబర్ కు ఫోన్ చేసింది. బ్యాంకు ఖాతాలో మరో రూ. 6 లక్షలేస్తే మొత్తం డబ్బు కారు వస్తుందని ఇంకా నమ్మించాడు. ఇంటికెళ్లిన ఆమె వైఖరిని చూసి కుమారుడు ప్రశ్నించగా, మొత్తం విషయం చెప్పి బావురుమంది. దీంతో తన తల్లిని తీసుకుని వచ్చిన అతను పోలీసులను ఆశ్రయించాడు.

  • Loading...

More Telugu News