t-congress: గాడ్ ఫాదర్ లేకపోతే ఎటువంటి అవకాశాలు రావని అర్థమైంది: సర్వే సత్యనారాయణ అల్లుడు క్రిశాంక్
- కంటోన్మెంట్ ప్రజలకు సర్వే అంటే ఎవరో తెలియదు
- గర్భిణీ భార్యను ఇంట్లోనే వదిలి ‘బస్తీ నిద్ర’ చేశాను
- కాంగ్రెస్ ని యాక్టివ్ చేశా..అయినా నాకు టికెట్ రాలేదు
టీ-కాంగ్రెస్ నేత సర్వే సత్యనారాయణపై ఆయన అల్లుడు క్రిశాంక్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తొలి జాబితాలో ఆయనకు టికెట్ దక్కకపోవడంపై హైదరాబాద్ లోని గాంధీ భవన్ వద్ద ఆయన నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, కంటోన్మెంట్ ప్రజలకు సర్వే సత్యనారాయణ అంటే ఎవరో తెలియదని అన్నారు.
‘గర్భిణీ అయిన నా భార్యను ఇంట్లోనే వదిలేసి కంటోన్మెంట్ లో ఉన్న మొత్తం 17 బస్తీల్లో ఐదు నెలల పాటు ‘బస్తీ నిద్ర’ చేశాను. కంటోన్మెంట్ లో ఒక స్థాయిలో కాంగ్రెస్ పార్టీని యాక్టివ్ చేస్తే.. ఉస్మానియా జేఏసీ కోటాలో కానీ, యువత కోటాలో కానీ నాకు టికెట్ రాలేదు. బాధాకరమైన విషయమేంటంటే.. నాలుగున్నరేళ్ల నుంచి కూడా ఆ నియోజకవర్గంపై ఒక్క ప్రెస్ మీట్ కూడా సర్వే సత్యనారాయణ గారు పెట్టలేదు..’ అంటూ విమర్శించారు.
టికెట్ ఇవ్వని కాంగ్రెస్ పార్టీ తనను తిరస్కరించిందని తాను భావిస్తున్నానని, కొంతమంది తనకు టికెట్ రాకుండా అడ్డుకున్నారని క్రిశాంక్ విమర్శించారు. యువత రాజకీయాలు చేయాలంటే వారికి గాడ్ ఫాదర్ కావాలన్న విషయం తనకు అర్థమైందని, గాడ్ ఫాదర్ లేని వారికి ఎటువంటి అవకాశాలు రావని ఆవేదన వ్యక్తం చేశారు.