Rajinikanth: బీజేపీని పొగుడుతూనే విమర్శించిన రజనీకాంత్!
- ఒకరిపై 10 మంది యుద్ధాన్ని ప్రకటించారంటే.. ఎవరు బలవంతులు?
- నా వెనుక బీజేపీ లేదు.. దేవుడు, ప్రజలే ఉన్నారు
- నోట్ల రద్దు అమలులో కొన్ని లోపాలు ఉన్నాయి
తమిళనాడులో సొంత పార్టీని నెలకొల్పిన సూపర్ స్టార్ రజనీకాంత్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బీజేపీకి అనుకూలంగా ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. జాతీయ స్థాయిలో బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ ఒక కూటమిగా ఏర్పడుతున్న అంశానికి సంబంధించి... బీజేపీ అంత డేంజరస్ పార్టీనా? అనే ప్రశ్నకు బదులుగా... ఆ పార్టీలన్నీ అలా అనుకుంటున్నాయని, కాబట్టి అది నిజం కావచ్చని చెప్పారు. ఈ వ్యాఖ్యలు చేసి 24 గంటలు కూడా గడవకముందే... రజనీ మరోసారి స్పందించారు. విపక్ష పార్టీలకు బీజేపీ డేంజరస్ కావచ్చని, తనకు కాదని చెప్పారు. బీజేపీ ఎలాంటి పార్టీనో ప్రజలు నిర్ణయిస్తారని అన్నారు.
10 మంది వ్యక్తులు ఒక వ్యక్తితో తలపడుతున్నారంటే... వీరిలో ఎవరు బలవంతులు? అని రజనీ ప్రశ్నించారు. ఒక వ్యక్తిపై 10 మంది యుద్ధాన్ని ప్రకటించారంటే... వీరిలో ఎవరు బలవంతులు? అని అడిగారు. ప్రధాని మోదీని బలవంతుడిగా భావిస్తున్నారా? అనే ప్రశ్నకు బదులుగా... తనకు అంత క్లారిటీ లేదని సమాధానం చెప్పకుండా తప్పించుకునే ప్రయత్నం చేశారు.
తన వెనుక బీజేపీ ఉందని చాలా మంది అనుకుంటుంటారని... అది నిజం కాదని అన్నారు. తన వెనుక కేవలం దేవుడు, ప్రజలు మాత్రమే ఉన్నారని చెప్పారు. తనవి ఆధ్యాత్మిక రాజకీయాలని... నిజాయతీ, నిజాలపై తమ పార్టీ ఆధారపడుతుందని అన్నారు. పెద్ద నోట్ల రద్దు సరైన నిర్ణయం కాదని అభిప్రాయపడ్డారు. నోట్ల రద్దును అమలు చేయడంలో కొన్ని లోపాలు ఉన్నాయని... వాటిపై లోతైన చర్చ జరగాల్సిన అవసరం ఉందని అన్నారు.