SEXUAL harrasment: మహిళా మెడికల్ ఆఫీసర్ కు ఆకతాయిల లైంగిక వేధింపులు.. ప్రతిఘటించడంతో తీవ్రంగా కొట్టి పరారైన దుండగులు!
- ఉత్తరప్రదేశ్ లోని ముజఫర్ నగర్ లో ఘటన
- పోలీసులను ఆశ్రయించిన బాధితురాలు
- నిందితుల కోసం గాలిస్తున్న అధికారులు
ప్రభుత్వాలు ఎన్ని చట్టాలు తెచ్చినా, అధికారులు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా కామాంధుల ఆగడాలకు మాత్రం అడ్డుకట్ట పడటం లేదు. తాజాగా విధులు ముగించుకుని వెళుతున్న ఓ మహిళా వైద్యాధికారిని కొందరు ఆకతాయిలు లైంగిక వేధింపులకు గురిచేశారు. దీంతో సదరు అధికారిణి ప్రతిఘటించడంతో ఆమెపై తీవ్రంగా దాడి చేసి పరారయ్యారు. ఉత్తరప్రదేశ్ లోని ముజఫర్ నగర్ లో ఉన్న రాంపురి ప్రాంతంలో ఈ నెల 7న చోటుచేసుకున్న ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
యూపీలోని రాంపురిలో ఓ మహిళ మెడికల్ ఆఫీసర్ గా విధులు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో నవంబర్ 7న విధులు ముగించుకుని ఆమె ఇంటికి బయలుదేరారు. అయితే మార్గమధ్యంలో చందూ సింగ్, బిహారీ, మరో యువకుడు ఆమెను అటకాయించారు. లైంగికంగా వేధించడం మొదలుపెట్టారు. వీటిని భరించలేక ఆ అధికారిణి తిరగబడటంతో, ఆకతాయిలు ఆమెపై విచక్షణారహితంగా దాడి చేశారు. అనంతరం ఘటనాస్థలం నుంచి పరారయ్యారు. తీవ్రంగా గాయపడ్డ బాధితురాలు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసింది.
కాగా, మహిళా అధికారి ఫిర్యాదుతో దుండగులపై కేసు నమోదు చేసినట్లు పోలీస్ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. ప్రస్తుతం నిందితులు పరారీలో ఉన్నారనీ, వీరిని వెంటనే అదుపులోకి తీసుకునేందుకు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించామన్నారు.