rajiv shukla: వ్యూహాత్మకంగానే తెలంగాణలో సీట్ల ప్రకటనను ఆలస్యం చేశాం: కాంగ్రెస్ నేత రాజీవ్ శుక్లా
- మహాకూటమికి 80 సీట్లు రావడం ఖాయం
- మోదీ, కేసీఆర్ అబద్ధాలకోరులు
- 4000 ప్రభుత్వ పాఠశాలలను కేసీఆర్ మూసివేశారు
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో తమ అభ్యర్థులకు టీఆర్ఎస్ ఇప్పటికే బీఫామ్ లు కూడా ఇచ్చేసింది. మరోవైపు, మహాకూటమిలో సీట్ల సర్దుబాటు, అభ్యర్థుల ప్రకటన ఇంకా పూర్తి కాలేదు. ఈ నేపథ్యంలో, కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి రాజీవ్ శుక్లా ఈ అంశంపై స్పందించారు.
సీట్ల ప్రకటనను కాంగ్రెస్ ఆలస్యం చేస్తుండటం రాజకీయ వ్యూహంలో ఒక భాగమేనని చెప్పారు. పొత్తులు ఉన్నప్పుడు ఇలాంటి వ్యూహాలు సాధారణమేనని అన్నారు. కాంగ్రెస్ గెలవబోతోంది కాబట్టే... ఎక్కువ మంది సీట్లను ఆశిస్తున్నారని చెప్పారు. తమ సర్వేల ప్రకారం తెలంగాణలో మహాకూటమి 80 సీట్లను కైవసం చేసుకుంటుందని అన్నారు.
ప్రధాని మోదీ, టీఎస్ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇద్దరూ అబద్ధాలకోరులేనని శుక్లా విమర్శించారు. రాష్ట్రంలో 4000 ప్రభుత్వ పాఠశాలలను మూసివేసి... ప్రైవేట్ పాఠశాలలకు కేసీఆర్ లబ్ధి చేకూర్చారని అన్నారు. మహాకూటమి అధికారంలోకి రావడం ఖాయమని జోస్యం చెప్పారు.