AIMIM: నన్ను చంపేందుకు 11 మంది హైదరాబాదులో దిగారు!: అక్బరుద్దీన్ సంచలన వ్యాఖ్యలు

  • నన్ను చంపడానికి కుట్రలు మొదలయ్యాయి
  • చావడానికి, గుండెల్లో బుల్లెట్లు దింపుకోవడానికి నేను రెడీ
  • మూడు తూటాలు కూడా నన్నేమీ చేయలేకపోయాయి

ఎంఐఎం నేత అక్బరుద్దీన్ ఒవైసీ సంచలన వ్యాఖ్యలు చేశారు. తన ప్రాణాలకు ముప్పుందని, తనను చంపేందుకు దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి 11 మంది హైదరాబాద్ చేరుకున్నారని పేర్కొన్నారు. ఓ బహిరంగ సభలో మాట్లాడుతూ ఆయనీ వ్యాఖ్యలు చేశారు. తనకు బెదిరింపు లేఖలు, ఫోన్ కాల్స్ వచ్చాయని తెలిపారు.

‘‘వారు నన్ను చంపేస్తామని బెదిరించారు. అక్బర్ ఒవైసీ.. నిన్ను చంపేస్తామంటూ ఫోన్ కాల్స్, లేఖలు వచ్చాయి’’ అని పేర్కొన్నారు. తనను చంపేందుకు బెనారస్, అలహాబాద్, కర్ణాటక నుంచి మొత్తం 11 మంది వచ్చినట్టు తెలుస్తోందన్నారు. ‘‘నేను చచ్చిపోవడానికి సిద్ధంగా ఉన్నాను. నా గుండెల్లో, నా వెన్నులో తూటాలు దింపించుకోవడానికి సిద్ధంగా ఉన్నాను’’ అని అక్బరుద్దీన్ అన్నారు. త్వరలో తెలంగాణలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన చాంద్రాయణగుట్ట నుంచి బరిలో ఉన్నారు.

30 ఏప్రిల్ 2011లో బార్కస్‌లోని ఎంఐఎం కార్యాలయంలో తనపై హత్యాయత్నం జరిగిందని ఈ సందర్భంగా గుర్తు చేశారు. పదునైన ఆయుధాలు, తుపాకులతో తనపై కొందరు దాడి చేశారన్నారు. తనపై మూడుసార్లు కాల్పులు జరిపినా తాను తప్పించుకున్నట్టు చెప్పారు. ‘‘మూడు తూటాలు తగిలితేనే చావలేదు. మీ బుల్లెట్లు నా ప్రాణాలు తీస్తాయా?’’ అని ప్రశ్నించారు. అక్బరుద్దీన్ వ్యాఖ్యలపై స్పందించిన పోలీసులు.. తమకు ఇప్పటి వరకు ఆయన నుంచి ఎటువంటి ఫిర్యాదు అందలేదని తెలిపారు.

AIMIM
Akbaruddin Owaisi
Hyderabad District
Chandrayangutta
  • Loading...

More Telugu News