Bombay High court: పురుషులను ఇక అలా పిలిచారో.. పరువు నష్టం తప్పదు: బాంబే హైకోర్టు
- తనను నపుంసకుడు అన్న భార్య
- కోర్టును ఆశ్రయించిన భర్త
- తప్పేనన్న ధర్మాసనం
తనను ‘నపుంసకుడు’ అన్న భార్యపై కోర్టుకెక్కిన భర్తకు అనుకూలంగా బాంబే హైకోర్టు తీర్పు చెప్పింది. మగవాళ్లను ‘నపుంసకుడు’ అని పిలిస్తే వారి పరువుకు భంగం కలిగించడమే అవుతుందని స్పష్టం చేసింది. ఇకపై ఇలాంటి పదాలు ఉపయోగిస్తే పరువునష్టం కేసులు ఎదుర్కోక తప్పదని హెచ్చరించింది. ఇటువంటి పదాలు మగవాళ్లపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపిస్తాయని అభిప్రాయపడింది.
నాగ్‌పూర్‌కు చెందిన ఓ జంట మధ్య అభిప్రాయ భేదాలు పొడసూపాయి. దీంతో తనకు విడాకులు ఇప్పించాల్సిందిగా కోరుతూ భార్య తన సొంత రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్‌లో కోర్టుకెక్కింది. విచారించిన కోర్టు వారి కుమార్తె బాధ్యతను తాత్కాలికంగా ఆమె భర్తకు అప్పగించింది. దీనిని ఆమె సవాలు చేస్తూ నాగ్‌పూర్‌లోని హైకోర్టు ధర్మాసనాన్ని ఆశ్రయించింది. తన భర్త నపుంసకుడని అందులో పేర్కొంది.
దీనిని తీవ్రంగా పరిగణించిన భర్త ఆమెతోపాటు వారి కుటుంబ సభ్యులపైనా పరువునష్టం కేసు వేశారు. అతడిని అగౌరవ పరచాలనే ఉద్దేశంతో ఆ పదాన్ని ఉపయోగించలేదని, ఆ కేసును కొట్టివేయాలని అతడి భార్య కోర్టును వేడుకున్నారు. తమకు వైద్య చికిత్సలోని అధునాతన పద్ధతి ద్వారా పాప జన్మించిందని కోర్టుకు తెలిపారు. అయితే, ఆమె వాదనను కోర్టు తిరస్కరించింది. ఆ విషయం చెప్పడానికి ఆ పదాన్ని ఉపయోగించాల్సిన పనిలేదని, ఆ పదాన్ని ఉపయోగించి అతడి పరువుకు భంగం కలిగించారని తేల్చి చెప్పింది. దీనిని తప్పకుండా పరిగణనలోకి తీసుకుంటామని స్పష్టం చేసింది.