Govinda: నేను ప్రధాన పాత్రలో నటించిన చిత్రాలేవీ విడుదలకు నోచుకోవట్లేదు: గోవింద ఆవేదన
- 20 సన్నివేశాలను తొలగించిన సెన్సార్ బోర్డు
- నిహలానీ వంటి నిర్మాతలు నష్టపోవాల్సి వస్తోంది
- తొమ్మిదేళ్లుగా కొందరు వివక్ష చూపుతున్నారు
- మంచి రివ్యూలు రావడాన్ని సహించలేకపోతున్నారు
ఒకప్పుడు బాలీవుడ్‌లో గోవిందా అంటే ఫుల్ క్రేజ్ ఉండేది. ఆయనతో సినిమాలు చేసేందుకు దర్శక నిర్మాతలు క్యూ కట్టేవారు. ఇప్పటికీ సినిమాలు చేస్తూనే ఉన్నారు కానీ తను నటించిన చిత్రాలు విడుదలకు నోచుకోలేని పరిస్థితి. దీంతో ఆయన మీడియా ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు. గోవింద ప్రధాన పాత్రలో నటించిన ‘రంగీలా రాజా’ చిత్రం నుంచి సెన్సార్ బోర్డు 20 సన్నివేశాలను తొలగించడంతో ఈ నెల 8న విడుదల కావాల్సి ఉన్నా వాయిదా పడింది.
గత తొమ్మిదేళ్లుగా కొందరు తనపై వివక్ష చూపుతున్నారని ఈ సందర్భంగా గోవింద అన్నారు. తాను ప్రధాన పాత్రలో నటించిన సినిమాలేవీ విడుదలకు నోచుకోవట్లేదని ఆవేదన వ్యక్తం చేశారు. దీని కారణంగా నిహలానీ వంటి నిర్మాతలు చాలా నష్టపోవాల్సి వస్తోందని ఆయన తెలిపారు. తన చిత్రాలకు మంచి రివ్యూలు రావడాన్ని కొందరు సహించలేకపోతున్నారని ఆరోపించారు. ‘థగ్స్ ఆఫ్ హిందూస్థాన్’ చిత్రానికి సర్టిఫికేట్ ఇచ్చిన సీబీఎఫ్‌సీ ఛైర్మన్ ప్రసూన్ జోషి తన చిత్రానికి ఇవ్వలేకపోయారన్నారు. దీనిపై తాము విమర్శించేసరికి గైడ్‌లైన్స్ పుస్తకం చూడకుండానే తన చిత్రం నుంచి 20 సన్నివేశాలను తొలగించారని గోవింద ఆవేదన వ్యక్తం చేశారు.