TRS: అన్ని వర్గాల వారినీ కేసీఆర్ కుటుంబం మోసం చేసింది!: ఉత్తమ్ కుమార్ రెడ్డి విమర్శ

  • మంచి వాతావరణంలో కూటమి ముందుకెళ్తోంది
  • ప్రజలను మోసం చేయాలన్న కుట్రతోనే ‘ముందస్తు’ 
  • ఎన్నికల అనంతరం కేసీఆర్, బీజేపీతో జట్టుకడతారు

మహాకూటమిగానే ఎన్నికలకు వెళ్తామని టీ-పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి మరోసారి స్పష్టం చేశారు. తెలంగాణ జన సమితి (టీజేఎస్) అధినేత ప్రొఫెసర్ కోదండరామ్ తో ఉత్తమ్, టీ-టీడీపీ అధ్యక్షుడు ఎల్. రమణ భేటీ అయ్యారు. నాంపల్లిలోని టీజేఎస్ కార్యాలయంలో ఈ భేటి జరిగింది.

అనంతరం, మీడియాతో ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ, మంచి వాతావరణంలో తామందరమూ ముందుకెళ్తున్నామని తెలంగాణ ప్రజల ఆకాంక్షల అజెండా కమిటీ కన్వీనర్ గా కోదండరామ్ ఉంటారని, ఎన్నికల ముందు, ఆ తర్వాత కూడా ఆయనే కొనసాగుతారని అన్నారు. కేసీఆర్ ను గద్దె దించాలన్న ప్రజల ఆకాంక్షల మేరకే కూటమిగా ఏర్పడ్డామని, ఎన్నికల్లో తప్పనిసరిగా కూటమి విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

ఈ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం రాని వారికి భవిష్యత్ లో ప్రాధాన్యత కల్పిస్తామని, ఉద్యమంలో ఐకాస చైర్మన్ గా అన్ని రాజకీయ పక్షాలను కోదండరామ్ కలుపుకొని వెళ్లిన విషయాన్ని ఆయన గుర్తుచేసుకున్నారు. తెలంగాణ ఏర్పాటులో కోదండరామ్ పాత్రను ప్రజలంతా గుర్తుంచుకుంటారని అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ప్రజల ఆకాంక్షలు, ఆశయాలపై కేసీఆర్ నీళ్లు జల్లారని, అమరవీరుల కుటుంబాలకు ఆర్థిక సాయం అందించలేదని విమర్శించారు.

నాలుగున్నరేళ్ల టీఆర్ఎస్ పాలనలో ప్రజలకు మేలు జరగలేదని భావిస్తున్నారని అభిప్రాయపడ్డారు. కేసీఆర్, మోదీ కలిసి తొమ్మిది నెలల ముందే తెలంగాణ అసెంబ్లీని రద్దు చేశారని, తెలంగాణ ప్రజలను మోసం చేయాలన్న కుట్రతోనే కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్తున్నారని విమర్శించారు. ఎన్నికల అనంతరం కేసీఆర్, బీజేపీతో జట్టుకడతారన్న అనుమానం వ్యక్తం చేశారు.

తెలంగాణలో అన్ని వర్గాల వారిని కేసీఆర్ కుటుంబం మోసం చేసిందని, చివరకు రాష్ట్రం కోసం పోరాడిన వారిని అవమానించిందని మండిపడ్డారు. అహంకారంతో వ్యవహరిస్తున్న కేసీఆర్ కుటుంబం మరోసారి తెలంగాణ ప్రజలపై కుట్ర చేస్తోందని, కేసీఆర్ కుటుంబ పాలన నుంచి తెలంగాణకు విముక్తి కల్గించాలని అన్నారు.

  • Loading...

More Telugu News