Jayalalitha: జయలలిత మృతిపై తమిళ మంత్రి సంచలన వ్యాఖ్యలు
- జయకు స్లోపాయిజన్ ఎక్కించారు
- వేళకు తిండిపెట్టకుండా వేధించారు
- దినకరన్ వర్గమే దీని కారణం
తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత మృతిపై రాష్ట్ర అటవీశాఖ మంత్రి దిండుగల్ శ్రీనివాసన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆమె మృతికి స్లో పాయిజనే కారణమని ఆరోపించారు. దినకరన్ వర్గం జయను ఇంట్లో బంధించి మధుమేహం అధికమయ్యేలా స్లో పాయిజన్ ఇచ్చారన్నారు. అంతేకాక, వేళాపాళా లేకుండా ఆహారం అందించి ఆరోగ్యం పాడయ్యేలా చేశారన్నారు.
దినకరన్ ఎటువంటి వాడో తెలిసే జయ అతడిని పదేళ్లపాటు దూరంగా ఉంచిందని గుర్తు చేశారు. జయ మరణానికి అతడి వర్గమే కారణమన్నారు. డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్‌తో కలిసి ప్రభుత్వాన్ని పడగొట్టాలని దినకరన్ కుట్ర పన్నారని, ఆయన ఆటలు సాగబోవని అన్నారు. కాగా, శ్రీనివాసన్ వ్యాఖ్యలు మరోమారు తమిళనాట హాట్ టాపిక్‌గా మారాయి. ప్రస్తుతం జయలలిత మృతిపై జస్టిస్ ఎ.అరుముగ స్వామి నేతృత్వంలోని ఏక సభ్య కమిషన్ దర్యాప్తు చేస్తోంది.