mini Taj Mahal: భార్య కోసం మినీ తాజ్‌మహల్‌ను నిర్మించిన ఫైజల్ హసన్ మృతి
- చనిపోయిన భార్య కోసం తాజ్‌మహల్ నిర్మించిన ఖాద్రీ
- భార్య సమాధి పక్కనే ఆయనను కూడా ఖననం
- అచ్చం షాజహాన్-ముంతాజ్ ప్రేమకథలానే..
ఫైజల్ హసన్ ఖాద్రీ (83).. చనిపోయిన తన భార్య కోసం మినీ తాజ్‌మహల్‌ను నిర్మించి ఒక్కసారిగా దేశం దృష్టిని ఆకర్షించాడు. గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆయన మరణించిన వార్త ఇప్పుడు అందరినీ విషాదంలోకి నెట్టింది. ఉత్తరప్రదేశ్‌లోని కేసర్ కలాన్‌లో ఓ వాహనం అతడిని ఢీకొట్టి వెళ్లిపోయింది. ఈ ఘటనలో తీవ్ర గాయాల పాలైన ఖాద్రీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందాడు.
1953లో ఖాద్రీకి తాజా ముల్లీ బీబీతో వివాహమైంది. ఆమె మరణానంతరం ఆమె ప్రేమకు గుర్తుగా 2012లో మినీ తాజ్ మహల్ నిర్మాణాన్ని చేపట్టాడు. ఇందుకోసం తాను కూడబెట్టిన డబ్బు అంతటినీ ఖర్చు చేశాడు. అయినప్పటికీ నిర్మాణం పూర్తి కాలేదు. విషయం తెలిసిన అప్పటి యూపీ ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్ ఆయనను లక్నో పిలిపించుకుని మాట్లాడారు. మినీ తాజ్ మహల్ నిర్మాణానికి అవసరమైన సొమ్ము అందిస్తానని హామీ ఇచ్చారు.
అయితే, అఖిలేశ్ ప్రతిపాదనను ఖాద్రీ సున్నితంగా తిరస్కరించాడు. తనకు సాయం చేస్తానన్న సొమ్ముతో గ్రామంలో బాలికల కళాశాల ఏర్పాటు చేయాలని సూచించాడు. సరేనన్న ముఖ్యమంత్రి గ్రామంలో కాలేజీ నిర్మించారు. అందు కోసం ఖాద్రీ తన సొంత భూమిని ఇచ్చాడు.
ఖాద్రీ కుటుంబ సభ్యులు మాట్లాడుతూ.. ఖాద్రీ రెండు లక్షల రూపాయల వరకు దాచుకున్నారని, ఆ సొమ్ముతో మినీ తాజ్‌మహల్‌లో మార్బల్ వర్క్ పూర్తి చేస్తామని చెప్పారు. ఇప్పుడతడి మృతదేహాన్ని ఆమె భార్య సమాధి పక్కనే సమాధి చేయాలని కుటుంబ సభ్యులు నిర్ణయించారు. అంటే తాజ్‌మహల్‌లోని షాజ్‌హాన్-ముంతాజ్‌లాగా అన్నమాట. ఖాద్రీ కోరిక మేరకు తాజ్‌మహల్ నిర్మాణాన్ని పూర్తి చేస్తామని, అది తమకు దక్కిన గౌరవమని పేర్కొన్నారు.