Lalu Prasad Yadav: తేజ్‌ప్రతాప్ ఎఫెక్ట్.. 11 రోజులపాటు హోమం చేసిన లాలు కుటుంబం

  • వింధ్యవాసిని దేవి ఆలయంలో హోమం
  • 11 మంది వేద పండితులతో 11 రోజులపాటు పూజలు
  • కుటుంబ పరిణామాలతో ఒత్తిడిలో లాలు

తేజ్‌ప్రతాప్-ఐశ్వర్య రాయ్ విడాకుల గొడవతో ప్రస్తుతం లాలు కుటుంబం తీవ్ర కలత చెందుతోంది. ఇంట్లో నైరాశ్యం అలముకుంది. అశాంతి కొరవడి ఆందోళన పెరిగింది. ఈ నేపథ్యంలో తమ కుటుంబంలో తిరిగి శాంతిని ప్రసాదించమని కోరుతూ లాలు కుటుంబం 11 రోజులపాటు అమ్మవారి గుడిలో హోమం చేసినట్టు తెలుస్తోంది.

తూర్పు ఉత్తరప్రదేశ్‌లో కొలువై ఉన్న వింధ్యవాసిని దేవి అమ్మవారిపై లాలు కుటుంబానికి ఎనలేని భక్తి. కోరిన కోర్కెలు తీర్చే అమ్మవారిగా ప్రసిద్ధి చెందిన ఈ ఆలయాన్ని లాలు కుటుంబం తరచూ సందర్శిస్తూ ఉంటుంది. ఈ నేపథ్యంలో తమ కుటుంబంలో కలతలు కడతేరి శాంతి చేకూరేలా అనుగ్రహం ప్రసాదించాలని కోరుతూ లాలు కుటుంబం ఆలయంలో 11 రోజులపాటు హోమం నిర్వహించినట్టు పూజారి ఒకరు తెలిపినట్టు పీటీఐ వార్తా సంస్థ పేర్కొంది. 11 మంది రుత్విక్కులు 11 రోజులపాటు యాగం చేశారని, చివరి రోజైన గురువారం రాత్రి ‘పూర్ణాహుతి’కూడా నిర్వహించినట్టు ఆలయ పూజారి రాజ్ మిశ్రా తెలిపారు.

లాలు తనయుడు తేజ్ ప్రతాప్ ఇటీవల తన భార్య ఐశ్వర్య నుంచి విడాకులు ఇప్పించాల్సిందిగా కోర్టును ఆశ్రయించారు. ఈ విషయాన్ని ఆసుపత్రిలో ఉన్న తన తండ్రి లాలుకు చెప్పారు. ఈ విషయంలో తొందరపడొద్దని, అందరం కలిసి కూర్చుని మాట్లాడుకుందామని నచ్చజెప్పారు. తేజ్ ప్రతాప్ మాత్రం విడాకులకే మొగ్గు చూపారు. అయితే, తన కుటుంబం మొత్తం తన భార్యకే మద్దతు పలుకుతోందని, తనపై  సొంతవాళ్లే కుట్ర చేస్తున్నారంటూ అలిగి ఇంటి నుంచి వెళ్లిపోయారు. ప్రస్తుతం ఆయన హరిద్వార్‌లో ఉన్నట్టు తెలుస్తోంది.  

దాణా కుంభకోణంలో జైలు శిక్ష అనుభవిస్తున్న లాలు ప్రసాద్ ప్రస్తుతం రాంచీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. తమ ఇంట్లో జరుగుతున్న పరిణామాలతో తీవ్ర కలత చెందిన ఆయన ఒత్తిడికి గురైనట్టు వైద్యులు తెలిపారు.  

Lalu Prasad Yadav
Aishwarya Rai
Tej Pratap
Bihar
Vindhyavasini Devi temple
  • Loading...

More Telugu News