tata steel: తనను తొలగించిన సీనియర్ మేనేజర్‌ను తుపాకితో కాల్చి చంపిన టాటా స్టీల్ ఉద్యోగి

  • క్రమ శిక్షణ రాహిత్యం కింద తొలగించిన కంపెనీ
  • ఉద్యోగం నుంచి తీసేయడంతో కక్ష
  • మేనేజర్ గదిలోకి వెళ్లి కాల్చి చంపిన నిందితుడు

ఫరీదాబాద్‌లో దారుణం జరిగింది. ఉద్యోగం నుంచి తనను తొలగించడాన్ని తట్టుకోలేని టాటా స్టీల్ ఉద్యోగి ఒకరు సరాసరి మేనేజర్ రూములోకి వెళ్లి పాయింట్ బ్లాంక్‌లో తుపాకి గురిపెట్టి కాల్చి చంపాడు. అనంతరం తుపాకి చూపి అందరినీ భయపెట్టి అక్కడి నుంచి పరారయ్యాడు.

ప్రత్యక్ష సాక్షి కథనం ప్రకారం.. సీనియర్ మేనేజర్ అరిందమ్ పల్ తన కేబిన్‌లో విశ్రాంతి తీసుకుంటుండగా లోపలికి ప్రవేశించిన ఉద్యోగి విశ్వాస్ పాండే తుపాకితో ఐదు రౌండ్లు కాల్పులు జరిపాడు. పల్ ఘటనా స్థలంలోనే మృతి చెందినట్టు పోలీసులు తెలిపారు.

ఇంజినీర్ అయిన నిందితుడు పాండే కంపెనీలో ఎగ్జిక్యూటివ్ మేనేజర్‌గా పనిచేస్తున్నాడు. క్రమశిక్షణ రాహిత్యంపై పలు ఫిర్యాదులు రావడంతో సీనియర్ మేనేజర్ అయిన అరిందమ్ పల్ అంతర్గత విచారణ జరిపారు. అతడిపై వచ్చిన ఆరోపణలు నిజమని తేలడంతో అతడిని విధుల నుంచి తప్పించారు.

అప్పటి నుంచి ఉద్యోగం లేక ఖాళీగా ఉన్న పాండే తనను క్షమించి ఉద్యోగం ఇవ్వాల్సిందిగా పలుమార్లు మొరపెట్టుకున్నాడు. అంతేకాదు, తనతో పెట్టుకుంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించాడు.

కాగా, పల్‌ను కాల్చి చంపిన అనంతరం పారిపోతున్న పాండేను పట్టుకునేందుకు ఉద్యోగులు ప్రయత్నించగా చంపుతానని తుపాకి చూపించి బెదిరించినట్టు పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు పాండే కోసం గాలింపు మొదలుపెట్టారు.

tata steel
Faridabad
Manager
Shot dead
Arindam pal
vishwas pandey
  • Loading...

More Telugu News