Andhra Pradesh: మరికాసేపట్లో టీడీపీ మంత్రులు, ముఖ్య నేతలతో సీఎం చంద్రబాబు కీలక భేటీ!
- మంత్రివర్గ విస్తరణపై చర్చ
- మండలి చైర్మన్ పదవి భర్తీపై క్లారిటీ
- ఉండవల్లికి చేరుకుంటున్న నేతలు
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి ఎన్నికలు సమీపిస్తున్న వేళ ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ రోజు పార్టీ ముఖ్యనేతలు, మంత్రులతో సమావేశం కానున్నారు. మంత్రివర్గ విస్తరణ, మండలి చైర్మన్ పదవి భర్తీతో పాటు ఏపీ, తెలంగాణలో నెలకొన్న రాజకీయ పరిస్థితులపై చర్చించనున్నారు. ఈ సందర్భంగా ఎస్టీ, మైనారిటీ నేతలతో బాబు భేటీ కానున్నారు. పదవులు దక్కని అసంతృప్త నేతలను చంద్రబాబు బుజ్జగిస్తున్నారు.
ఏపీ మంత్రివర్గంలోకి కిడారి శ్రవణ్ లేదా ఫరూక్ ను తీసుకునే అంశాన్ని చంద్రబాబు పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఇందుకోసం కీలక శాఖల్లో మార్పులు చేర్పులు చోటుచేసుకునే అవకాశముందని తెలుస్తోంది. మంత్రి పదవిని ఆశిస్తున్న ఎమ్మెల్యే చాంద్ బాషాతో పాటు మండలి చైర్మన్ పదవికి పోటీపడుతున్న షరీఫ్, రెడ్డి సుబ్రహ్మణ్యంతోనూ చంద్రబాబు విడిగా సమావేశం కానున్నారు.
ఈ సమావేశం నేపథ్యంలో టీడీపీ మంత్రులు, ముఖ్యనేతలు ఉండవల్లికి చేరుకుంటున్నారు. రేపు ఏపీ మంత్రివర్గ విస్తరణ ఉంటుందని టీడీపీ వర్గాలు ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే.