kcr: కేసీఆర్ థర్డ్ ఫ్రంట్ ఏమైంది?: జానారెడ్డి
- రేపు సీట్లను ప్రకటిస్తాం
- దేశ ప్రయోజనాల కోసమే కాంగ్రెస్, టీడీపీ కలిశాయి
- సెంటిమెంట్ ను రెచ్చగొట్టి లబ్ధి పొందాలనేది కేసీఆర్ యత్నం
మహాకూటమిలో పొత్తుల వ్యవహారం ఇంకా పూర్తి కాలేదని టీకాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి అన్నారు. టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి దుబాయ్ వెళ్లారని... రేపు సీట్లను ప్రకటిస్తామని చెప్పారు. కాంగ్రెస్ పార్టీలో బీసీలకు అన్యాయం జరగదని తెలిపారు. గతంలో మాదిరే బీసీలకు ఇప్పుడు కూడా సీట్లు కేటాయిస్తామని అన్నారు.
కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీ అని... ఊహించని విధంగా ముందస్తు ఎన్నికలు రావడం, కూటమి ఏర్పాటు కావడంతో... సీట్ల ప్రకటనలో కొంచెం ఆలస్యం అయిందని చెప్పారు. సీపీఐకి మూడు లేదా నాలుగు సీట్లు ఉండవచ్చని చెప్పారు. అకారణంగా అసెంబ్లీని రద్దు చేసిన దాఖలాలు ఎక్కడా లేవని అన్నారు.
పొత్తుల్లో పరస్పర అవగాహన చాలా ముఖ్యమని జానారెడ్డి చెప్పారు. వాళ్లకు కావాల్సిన సీట్లను మిత్రపక్షాలు అడిగాయని... కానీ, తమకు కూడా ముఖ్యమైన సీట్లు ఉంటాయని అన్నారు. దేశ అవసరాల కోసమే తాము చంద్రబాబుతో కలిశామని అన్నారు. దేశ భవిష్యత్తు కోసం రాహుల్ తో చంద్రబాబు కలిస్తే తప్పేముందని ప్రశ్నించారు.
కేసీఆర్ చెప్పిన థర్డ్ ఫ్రంట్ ఏమైందని ఎద్దేవా చేశారు. దేశంలో ఉన్న కీలక నేతలను కూడా కేసీఆర్ కలవలేకపోయారని అన్నారు. ఏదో విధంగా సెంటిమెంట్ ను రెచ్చగొట్టి, ఈ ఎన్నికల్లో కూడా లబ్ధి పొందాలని కేసీఆర్ యత్నిస్తున్నారని మండిపడ్డారు.