Tamilnadu: ‘సర్కార్’ వివాదం.. మురుగదాస్ కు అండగా నిలిచిన రజనీకాంత్, కమల్ హాసన్!
- దర్శకుడికి మద్దతు ప్రకటించిన విశాల్
- ఇలాంటి చర్యలు సరికాదన్న సూపర్ స్టార్
- అన్నాడీఎంకే సర్కారుకు కమల్ చురకలు
ఇలయ దళపతి విజయ్, నటి కీర్తి సురేశ్ జంటగా ప్రముఖ దర్శకుడు ఏఆర్ మురుగదాస్ తెరకెక్కించిన ‘సర్కార్’ సినిమా రాజకీయ సుడిగుండంలో చిక్కుకుంది. ఈ సినిమాలో దివంతగత జయలలితతో పాటు ఆమె తెచ్చిన సంక్షేమ పథకాలపై విమర్శనాత్మకంగా ఉన్న సీన్లను తొలగించాలని తమిళనాడు మంత్రులు డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు సినిమా దర్శకుడు మురుగదాస్ ను అరెస్ట్ చేసేందుకు నిన్న రాత్రి పోలీసులు ఆయన ఇంటికి వెళ్లడంతో ప్రస్తుతం అక్కడ టెన్షన్ టెన్షన్ వాతావరణం నెలకొంది.
ఈ నేపథ్యంలో దర్శకుడు మురుగదాస్ కు సూపర్ స్టార్ రజనీకాంత్, మక్కల్ నీది మయ్యం అధినేత కమల్ హాసన్, నడిగర్ సంఘం అధ్యక్షుడు విశాల్ మద్దతుగా నిలిచారు. ‘సర్కార్’ సినిమాపై జరుగుతున్న రాద్దాంతంపై రజనీ స్పందిస్తూ.. ‘సెన్సార్ బోర్డు ఓసారి ఆమోదం తెలిపిన సినిమాకు వ్యతిరేకంగా ఆందోళనలు నిర్వహించడం దారుణం. థియేటర్ల ముందు ధర్నాకు దిగడం, సినిమా పోస్టర్లను చించివేయడం.. ఇలాంటి చర్యలు ఆమోదయోగ్యం కాదు. ఈ ఘటనలను నేను తీవ్రంగా ఖండిస్తున్నా’ అని ట్వీట్ చేశారు.
మరోవైపు కమలహాసన్ స్పందిస్తూ..‘సర్కార్ లాంటి సినిమాల్లో మార్పులు చేయాలని వేధించడం ఈ ప్రభుత్వానికి కొత్తేం కాదు. సర్కార్ సినిమా సెన్సార్ ను ఎప్పుడో పూర్తిచేసుకుంది. ప్రజా విమర్శలను తట్టుకోలేని ప్రభుత్వం ఏదో ఒక రోజు కుప్పకూలిపోతుంది’ అంటూ ఘాటుగా విమర్శించారు.
కాగా, అసలు మురుగదాస్ ఇంట్లోకి పోలీసులు ఎందుకు వెళ్లారని నడిగర్ సంఘం అధ్యక్షుడు, హీరో విశాల్ ప్రశ్నించాడు. సెన్సార్ బోర్డు ఆమోదం తెలిపాక, ప్రజలు సినిమాను ఆస్వాదిస్తున్నప్పుడు ఈ అనవసర గొడవ ఏందుకన్నారు. ఈ నెల 6న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన సర్కార్ సినిమాను సన్ పిక్చర్స్ నిర్మించగా, స్వర మాంత్రికుడు ఏఆర్ రెహమాన్ సంగీతం సమకూర్చాడు.