Telangana: గల్ఫ్ ఓటర్లపై కాంగ్రెస్ నేతల కన్ను.. దుబాయ్ లో నేడు వలస కార్మికులతో భేటీ!
- గల్ఫ్ మేనిఫెస్టోను వివరించనున్న నేతలు
- ప్రజాకూటమి విజయానికి పక్కా ప్రణాళిక
- 25 నియోజకవర్గాల్లో గణనీయ ప్రభావం
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు సమీపించిన వేళ ప్రజల మనసు దోచుకునేందుకు నేతలు రకరకాల పాట్లు పడుతున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో ప్రజా కూటమి(మహాకూటమి) పేరుతో టీడీపీ, సీపీఐ, టీజేఎస్ వంటి విపక్షాలను ఏకం చేస్తున్న కాంగ్రెస్ పార్టీ తాజాగా గల్ఫ్ కార్మికులపై దృష్టి సారించింది. ఈ ఎన్నికల్లో గల్ఫ్ కార్మికుల ఓట్లను గంపగుత్తగా దక్కించుకునేందుకు కూటమి నేతలు సిద్ధమయ్యారు.
ఇందులో భాగంగా టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, మధుయాష్కీ, షబ్బీర్ అలీ, జీవన్ రెడ్డితో పాటు టీకాంగ్రెస్ ఎన్నికల ఇన్ చార్జ్ కుంతియాలు ఈరోజు దుబాయ్ లో పర్యటించనున్నారు. ఇక్కడ ఉన్న సోనాపూర్ శిబిరాల్లో ఉన్న తెలంగాణ ప్రజలను కలుసుకోనున్నారు. ఈ ఏడాది దీపావళి వేడుకలను యూఏఈ ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తోంది. ఈ సందర్భంగా ప్రవాస మిత్రబృందం ఆధ్వర్యంలో నేడు నిర్వహించనున్న కార్యక్రమంలో టీపీసీసీ నేతలు పాల్గొంటారు. గల్ఫ్ కార్మికుల కోసం తాము అమలు చేస్తున్న మేనిఫెస్టో గురించి నేతలు వారికి వివరించనున్నారు.
తెలంగాణలో 25 నియోజకవర్గాలను ప్రభావితం చేయగల స్థాయిలో గల్ఫ్ కార్మికుల కుటుంబాలు ఉన్నాయి. దాదాపు 10 లక్షల ఓటర్లను ఆకర్షించేందుకు అన్ని పార్టీలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి.