Kodandaram: వరంగల్ తూర్పు స్థానం కోసం చివరి వరకు పట్టుబట్టిన కోదండరాం!
- టీజేఎస్‌కు 8 సీట్లు ఖరారు చేసిన కాంగ్రెస్
- ఏడు సీట్లలో అభ్యర్థుల ఖరారు
- వర్ధరన్నపేట అభ్యర్థి కోసం టీజేఎస్ వేట
తెలంగాణ జనసమితి అధినేత కోదండరాం ఎక్కడి నుంచి బరిలోకి దిగబోతున్నదీ తేలిపోయింది. వచ్చే ఎన్నికల్లో ఆయన జనగామ నుంచి ఎన్నికల బరిలో నిలవనున్నారు. టీజేఎస్‌కు మొత్తం 8 స్థానాలు కేటాయించినట్టు కాంగ్రెస్ రాష్ట్రవ్యవహారాల బాధ్యుడు కుంతియా గురువారం ఢిల్లీలో ప్రకటించారు. అయితే, ఈ 8 సీట్లూ తాము కోరుకున్నవే ఇవ్వాలని కోదండరాం కోరినట్టు తెలుస్తోంది.
బయటకు వచ్చిన సమాచారం ప్రకారం.. జనగామ నుంచి టీజేఎస్ చీఫ్ కోదండరాం పోటీ చేయనుండగా, మెదక్ బరిలో జనార్దనరెడ్డి, దుబ్బాక నుంచి రాజ్‌కుమార్, సిద్దిపేట నుంచి భవాని, మల్కాజిగిరి నుంచి కపిలవాయి దిలీప్ కుమార్, మహబూబ్‌నగర్ నుంచి రాజేందర్ రెడ్డి, మేడ్చల్ నుంచి హరివర్ధన్ రెడ్డి పేర్లు ఖరారు అయ్యాయి.
ఇక వర్ధన్నపేట అభ్యర్థి పేరు ఖరారు కావాల్సి ఉంది. చివరి వరకు వరంగల్ తూర్పు స్థానం కోసం టీజేఎస్ పట్టుబడింది. ఇక్కడి నుంచి ఇన్నయ్యను బరిలోకి దింపాలని కోదండరాం యోచించారు. అయితే, సీట్ల సర్దుబాటులో భాగంగా ఆ స్థానాన్ని టీడీపీకి కేటాయించారు. ఇక్కడి నుంచి టీడీపీ నేత రేవూరి ప్రకాశ్ రెడ్డి పోటీ చేయనున్నారు.