USA: అమెరికా మీడియాపై ట్రంప్ చిందులు.. 'నోర్మూసుకుని కూర్చో' అంటూ రిపోర్టర్ కు వార్నింగ్!
- సీఎన్ఎన్ విలేకరిపై తీవ్ర ఆగ్రహం
- ఇబ్బందికర ప్రశ్నలు అడగటంపై మండిపాటు
- వైట్ హౌస్ లోకి రాకుండా నిషేధం
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి మీడియాపై చిందులు తొక్కారు. నిన్న ముగిసిన మధ్యంతర ఎన్నికల్లో డెమొక్రాట్లు విజయం సాధించిన నేపథ్యంలో మీడియా సమావేశం ఏర్పాటు చేసిన ట్రంప్.. విలేకరులు అడిగిన ప్రశ్నలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అమెరికా ఎన్నికల్లో రష్యా జోక్యం, వలసదారులపై కఠిన వైఖరిని ప్రశ్నించిన సీఎన్ఎన్ రిపోర్టర్ జిమ్ కోస్టాపై విరుచుకుపడ్డారు.
‘నువ్వు నీ ప్రవర్తన పట్ల సిగ్గుపడాలి. నువ్వు సీఎన్ఎన్ లో పని చేయకూడదు. నోరు మూసుకుని కూర్చో’ అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా జిమ్ అకోస్టా వద్ద ఉన్న మైక్ ను లాక్కునేందుకు ఓ మహిళా ఉద్యోగి యత్నించడంతో కలకలం చెలరేగింది. కాగా ఈ ఘటన నేపథ్యంలో అమెరికా అధ్యక్ష భవనం వైట్ హౌస్ లోకి జిమ్ కోస్టా ప్రవేశాన్ని రద్దు చేస్తూ ట్రంప్ నిర్ణయం తీసుకున్నారు. ఓ మహిళా ఉద్యోగిపై చేయి వేసినందుకు ఈ చర్యలు తీసుకున్నట్లు వైట్ హౌస్ అధికార ప్రతినిధి సారా శాండర్స్ తెలిపారు. కాగా, ఈ ఘటనపై జిమ్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.