Jayalalita: 'సర్కార్' సినిమాలో జయలలిత అసలు పేరుతో పాత్ర... అసలు వివాదమిదే!
- జయలలిత అసలు పేరు కోమలవల్లి
- అదే పేరుతో సినిమాలో ఓ క్యారెక్టర్
- తండ్రిని స్వయంగా చంపేసే కోమలవల్లి
- మండిపడుతున్న అన్నాడీఎంకే
ఈ వారం ప్రారంభంలో విడుదలైన విజయ్ 'సర్కార్' సినిమాపై ఇప్పుడు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ చిత్రంలో ఓ పాత్రకు జయలలిత అసలు పేరైన కోమలవల్లి పేరును పెట్టడం, ఆ పాత్ర అధికారం కోసం తండ్రిని స్వయంగా హత్య చేసినట్టు చూపించడంపై అన్నాడీఎంకే వర్గాలు మండిపడుతున్నాయి.
చిత్రంలో కోమలవల్లి పాత్రను పోషించిన వరలక్ష్మీ శరత్ కుమార్, విదేశాల్లో ఉన్న వేళ మోడ్రన్ డ్రస్సులను ధరించి, ఇండియాలో దిగగానే, నిండుగా, సంప్రదాయ చీరల్లో కనిపించడం, జయలలిత తన తొలినాళ్లలో రాజకీయ రంగ ప్రవేశం చేసిన వేళ కనిపించిన హావభావాలనే చూపించడం అన్నాడీఎంకే వర్గాల్లో తీవ్ర ఆగ్రహానికి కారణమైంది.
చిత్రంలో సీఎంగా ఉన్న తన తండ్రి, అవినీతి ఆరోపణల్లో కూరుకుపోతే, ఆయన చనిపోతేనే పార్టీ నిలుస్తుందన్న ఉద్దేశంతో, కోమలవల్లి స్వయంగా మాత్రలిచ్చి హత్య చేసినట్టు చూపించారు. ఇక కోమలవల్లి తండ్రి పాత్రను ఎంజీ రామచంద్రన్ తో పోలుస్తున్న తమిళ తంబీలు, ఈ సినిమాపై నిరసన వ్యక్తం చేస్తున్నారు.