kcr: నరేంద్రమోదీకి ‘తెలంగాణ’ను తాకట్టుపెట్టింది కేసీఆరే!: ఉత్తమ్ కుమార్ రెడ్డి
- మన రాష్ట్రానికి అమలు కావాల్సిన హామీలపై పోరాడరే?
- కేసీఆర్, కేటీఆర్, హరీశ్ లు ఎందుకు నోరుమెదపరు?
- మోదీకి ఎందుకు సరెండరయ్యారో జవాబు చెప్పాలి
తెలంగాణలో త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో పొరపాటున కాంగ్రెస్ పార్టీ గెలిస్తే కనుక తెలంగాణ ప్రజలు అమరావతికి లేదా ఢిల్లీకి పోవాలని టీఆర్ఎస్ నేతలు కేసీఆర్, కేటీఆర్ చేస్తున్న వ్యాఖ్యలపై టీ-పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఘాటుగా స్పందించారు. ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, వాళ్లు, అలా మాట్లాడేందుకు సిగ్గూలజ్జా ఉండాలని మండిపడ్డారు. నరేంద్ర మోదీకి ‘తెలంగాణ’ను తాకట్టుపెట్టింది వీళ్లేనని, వీళ్లు ఢిల్లీకి పోయినన్ని సార్లు, కాంగ్రెస్ పార్టీలోని ఏ పెద్దలు పోలేదని విమర్శించారు. నరేంద్రమోదీకి తెలంగాణను తాకట్టుపెట్టకపోతే, విభజన బిల్లులో మన రాష్ట్రానికి అమలు కావాల్సిన హామీలపై ఎందుకు పోరాడట్లేదని ప్రశ్నించారు.
విభజన బిల్లులో తెలంగాణా రాష్ట్రానికి ఇస్తామని హామీ ఇచ్చిన అంశాల్లో ఏ ఒక్కటీ అమలు కాకపోయినప్పటికీ కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావులు ఎందుకు నోరుమెదపడం లేదని ప్రశ్నించారు. మోదీకి ఎందుకు సరెండరయ్యారో వీళ్లు జవాబు చెప్పాలని డిమాండ్ చేశారు. మోదీ-కేసీఆర్ ది రహస్య ఒప్పందం అనేందుకు వీలు లేదని, బయటపడిన ఒప్పందమని విమర్శించారు.
తెలంగాణలోని మైనార్టీలను మోసం చేయడానికి, పార్లమెంట్ లో మోదీతో కలిసిపోయేందుకు ఈ ముందస్తు ఎన్నికలు వచ్చాయని మండిపడ్డారు. నాడు అవిశ్వాస తీర్మానం సమయంలో బీజేపీకి టీఆర్ఎస్ మద్దతుగా నిలిచిందని, ఆ సమయంలో మోదీ చేసిన ప్రసంగం బాగుందంటూ పొగిడిన ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ అని విమర్శలు చేశారు. బీజేపీ-టీఆర్ఎస్, మోదీ- కేసీఆర్ లు స్పష్టమైన ఒప్పందంతో ముందుకుపోతున్నారని చెప్పడానికి ఈ సంఘటనలే నిదర్శనమని ఉత్తమ్ అన్నారు.