Congress: ఈ జాబితా కాదు... మరొకటి తయారు చేయండి: టీ-కాంగ్రెస్ నేతలకు అధిష్ఠానం ఆదేశం
- ఒక్క సామాజిక వర్గం వారికే ప్రాధాన్యం
- యువకులు, బీసీలకు సీట్లను పెంచాలని రాహుల్ ఆదేశం
- 9వ తేదీన ఒకేసారి అభ్యర్థులందరి వివరాలు వెల్లడి
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ అభ్యర్థుల ప్రతిపాదిత జాబితా మరోమారు మారనుంది. ఇప్పటికే ఓ జాబితాను తయారు చేసి అధిష్ఠానానికి పంపగా, దీనిలో అన్ని వర్గాలకూ సమానమైన ప్రాధాన్యం లేదని, మరో జాబితాను తయారు చేసి తీసుకురావాలని రాహుల్ కోరినట్టు తెలుస్తోంది. మొత్తం 119 నియోజకవర్గాలకూ ఒకేసారి 9వ తేదీన అభ్యర్థుల వివరాలను ప్రకటించాలని మహాకూటమి భావిస్తున్నప్పటికీ, ఈ విషయంలో ఇంకా పూర్తి స్పష్టత రాలేదు.
వాస్తవానికి 2వ తేదీనే ఈ జాబితా వెల్లడికావలసి వున్నా, ఒకే సామాజిక వర్గానికి చెందిన నేతల పేర్లు అధికంగా కనిపిస్తుండటంతో, రాహుల్ జాబితాను తిరస్కరించారని సమాచారం. యువకులు, మహిళలు, బీసీ వర్గాలకు మరిన్ని సీట్లు ఇవ్వాలని తెలంగాణ పీసీసీ నేతలను ఆయన ఆదేశించినట్టు సమాచారం. ఇక, రాహుల్ దూతగా రాష్ట్రానికి ఓ సీనియర్ నేత వస్తారని, ఆయన సమక్షంలోనే అభ్యర్థుల జాబితా విడుదలవుతుందని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. మరోమారు స్క్రీనింగ్ కమిటీ సమావేశమై, అభ్యర్థుల జాబితాను మారుస్తుందని తెలిపారు.