harsihrao: ఏం చూసి ‘కాంగ్రెస్’ కు ఓటెయ్యాలి?: మంత్రి హరీష్ రావు
- ప్రజల కోసం పని చేసే పార్టీ టీఆర్ఎస్
- ఏపీకి ప్రత్యేకహోదా ఇస్తామని రాహుల్ అంటున్నారు
- మరి, తెలంగాణ పరిస్థితి ఏంటి?
ఏం చూసి ‘కాంగ్రెస్’ కు ఓటెయ్యాలి? అని మంత్రి హరీష్ రావు ప్రశ్నించారు. జహీరాబాద్ లో ఈరోజు నిర్వహించిన టీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ, ప్రజల కోసం పని చేసే పార్టీ టీఆర్ఎస్ అని, కాంగ్రెస్ లాగా మోసం చేసే పార్టీ కాదని అన్నారు. జహీరాబాద్ లో కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందని ఆ పార్టీకి ప్రజలు ఓటెయ్యాలని ప్రశ్నించారు. జహీరాబాద్ టీఆర్ఎస్ అభ్యర్థి మాణిక్ రావును భారీ మెజార్టీతో గెలిపించుకుందామని తమ కార్యకర్తలకు ఆయన పిలుపు నిచ్చారు.
ఏపీకి ప్రత్యేకహోదా ఇస్తామని కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ అంటున్నారని, మరి, తెలంగాణ పరిస్థితి ఏంటి? అని ప్రశ్నించారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తే ఒక్క సంస్థ కూడా తెలంగాణకు రాకపోగా, ఉన్న సంస్థలు కూడా తరలిపోయే అవకాశముందని అభిప్రాయపడ్డారు. తెలంగాణకు ఆంధ్రాతో సమానంగా పారిశ్రామిక రంగానికి రాయితీలు ఇవ్వాలని, లేకుంటే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి తగిన గుణపాఠం చెప్పక తప్పదని హెచ్చరించారు. ఏపీకి సమానంగా తెలంగాణకూ ‘హోదా’ ఇవ్వాలని ఈ సందర్భంగా హరీష్ రావు డిమాండ్ చేశారు.