MeToo India: మీటూ ఎఫెక్ట్ : హౌజ్‌ఫుల్-4 నుంచి నానా పటేకర్ ఔట్
- చిత్ర దర్శకుడు సాజిద్ఖాన్పైనా వేటు
- అక్షయ్‌కుమార్ మాటను గౌరవించిన నిర్మాతలు
- నానా స్థానంలో తెలుగు హీరో రానాకు అవకాశం
'హౌజ్‌ఫుల్-4' చిత్ర నిర్మాతలు సాహసోపేత నిర్ణయాలే తీసుకున్నారు. ప్రముఖ బాలీవుడ్ నటుడు నానాపటేకర్‌ను చిత్రం నుంచి తొలగిస్తున్నట్లు ప్రకటించారు. అలాగే, దర్శకుడు సాజిద్‌ఖాన్‌ను తొలగించాలని నిర్ణయించినట్లు సమాచారం. భారత్‌లో ప్రస్తుతం మీటూ ఉద్యమం తీవ్ర ప్రకంపనలు రేపుతున్న విషయం తెలిసిందే. నానాపటేకర్‌పై తనుశ్రీ దత్తా, సాజిద్‌ఖాన్‌పై నటి సలోని చోప్రా లైంగిక వేధింపుల ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే.
ఈ ఆరోపణలపై విచారణ పూర్తయ్యే వరకు షూటింగ్ నిలిపి వేయాలంటూ హీరో అక్షయ్‌కుమార్ డిమాండ్ చేశారు. దీంతో నిర్మాతలు వీరిద్దరినీ తొలగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. కాగా, నానాపటేకర్ స్థానంలో దగ్గుబాటి రానాను నిర్మాతలు ఎంపిక చేశారు. ఈ విషయాన్ని రానా ధ్రువీకరించారు.
‘వినూత్నమైన చిత్రాల్లో పనిచేయడం చాలా ఎక్సైటింగ్‌గా ఉంటుంది. పైగా హైదరాబాద్ వెలుపల పనిచేయడం మరింత సంతోషాన్నిస్తుంది. హౌజ్‌ఫుల్ చిత్రం వంటి జానర్లో నేనెప్పుడూ పనిచేయ లేదు. ఈ అవకాశం వల్ల కొత్త విషయాలు నేర్చుకునే అవకాశం కుగుతుంది’ అని రానా ఆనందం వ్యక్తం చేశారు.
మరోపక్క, చిత్రం యూనిట్‌తో ఈ వారంలోనే రానా కలవనున్నారని సమాచారం. సాజిద్ నడియావాలా నిర్మిస్తున్న ఈ చిత్రంలో అక్షయ్‌కుమార్, కృతిసనన్, రితేష్ దేశ్‌ముఖ్, పూజాహెగ్డే, బాబీడియోల్, కృతి కర్బందాలు నటిస్తున్నారు.