Telangana: ‘స్టాచ్యూ ఆఫ్ యూనిటీ’లో తెలుగుభాషకు దక్కని చోటు.. తీవ్రంగా స్పందించిన మంత్రి లోకేశ్!
- మోదీ సమైక్య స్ఫూర్తిని దెబ్బతీశారు
- తెలుగువారిని అవమానించారు
- ట్విట్టర్ లో కేంద్రంపై మండిపడ్డ లోకేశ్
ప్రధాని నరేంద్ర మోదీ నిన్న గుజరాత్ రాజధాని అహ్మదాబాద్ సమీపంలో నర్మద నదీ తీరాన సర్దార్ పటేల్ విగ్రహాన్ని ఆవిష్కరించిన సంగతి తెలిసిందే. దాదాపు 182 మీటర్లు ఉన్న ఈ ‘స్టాచ్యూ ఆఫ్ యూనిటీ’ ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన విగ్రహంగా రికార్డు సృష్టించింది. ఈ నేపథ్యంలో విగ్రహానికి అనుబంధంగా ఏర్పాటు చేసిన శిలాఫలకంలో తెలుగు భాషను చేర్చకపోవడంపై ఏపీ ఐటీ మంత్రి నారా లోకేశ్ అసహనం వ్యక్తం చేశారు.
ప్రధాని మోదీ తన చర్యతో సమైక్య స్ఫూర్తిని దెబ్బతీశారని వ్యాఖ్యానించారు. ‘ప్రపంచంలోనే ఎత్తయిన సర్దార్ పటేల్ విగ్రహాన్ని ఏర్పాటు చేయడంలో ప్రధాని మోదీ సఫలీకృతం అయ్యారు. కానీ పటేల్ అనుసరించిన సమైక్య స్ఫూర్తిని కాపాడటంలో మాత్రం మోదీ విఫలమయ్యారు. స్టాచ్యూ ఆఫ్ యూనిటీ ఏర్పాటు సందర్భంగా తెలుగు భాషను విస్మరించారు. తెలుగు భాషను విస్మరించి బీజేపీ మరోసారి తెలుగువారి ఆత్మగౌరవాన్ని దెబ్బతీసింది’ అని మంత్రి ట్వీట్ చేశారు.