Uttam Kumar Reddy: అధిష్ఠానం పిలుపుతో ఢిల్లీ వెళ్లిన ఉత్తమ్!
- ఈ మధ్యాహ్నం ఢిల్లీకి జానా, షబ్బీర్, భట్టి
- అభ్యర్థుల జాబితాపై చర్చ
- అభ్యర్థుల జాబితాను ఏఐసీసీ ప్రకటించే అవకాశం
అభ్యర్ధుల ఖరారు తుది దశకు వచ్చిన నేపథ్యంలో కాంగ్రెస్ జాతీయ ఎన్నికల కమిటీ ఛైర్మన్ ఏకే ఆంటోని పిలుపుతో టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఢిల్లీ బయల్దేరి వెళ్లారు. సీనియర్ నేతలు జానారెడ్డి, షబ్బీర్ అలీ, ప్రచార కమిటీ ఛైర్మన్ భట్టి విక్రమార్క కూడా ఈ మధ్యాహ్నం ఢిల్లీ వెళ్లే అవకాశాలు ఉన్నాయని, వీరంతా ఏకే ఆంటోనితో సమావేశమై అభ్యర్థుల జాబితాపై చర్చించనున్నారని కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. అలాగే పొత్తులతో కూటమిలోని భాగస్వామ్య పక్షాలకు కేటాయించిన సీట్లు మినహా మిగిలిన స్థానాలకు చెందిన అభ్యర్ధులపై జాతీయ ఎన్నికల కమిటీ నియోజక వర్గాల వారీగా పరిశీలించనుందని సమాచారం.
విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం పొత్తులతో పోయే 27 నుంచి 29 స్థానాలు, ఎక్కువ మంది పోటీ పడుతున్న మరొక 15 నుంచి 20 నియోజక వర్గాలను మినహాయించి 70 నుంచి 75 నియోజకవర్గాలకు ఒకేసారి అభ్యర్థులను ప్రకటించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే అభ్యర్థుల ప్రకటనలో తీవ్ర జాప్యంతో క్షేత్రస్థాయిలో తీవ్ర అసంతృప్తి నెలకొంది. ఈ నేపథ్యంలో ఎలాంటి ఇబ్బందుల్లేని స్థానాల్లో అభ్యర్థుల పేర్లు ప్రకటించాలని పీసీసీ భావిస్తున్నట్లు సమాచారం. ఈ రోజు జాతీయ ఎన్నికల కమిటీ ఆమోదముద్ర వేసే జాబితా రేపు రాహుల్ గాంధీ వద్దకు చేరుతుంది. రాహుల్ పరిశీలన తర్వాత ఏఐసీసీ అధికారికంగా జాబితాను వెల్లడించే అవకాశాలున్నాయని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి.