Crime News: అమ్మో...ఈవిడ మామూలావిడ కాదు : మ్యాట్రిమోని ఆధారంగా ద్విపాత్రాభినయం
- డాక్టర్ నంటూ అమ్మాయి వేషం...పిన్నినంటూ మరో పాత్ర
- బామ్మకు అనారోగ్యం చేసిందని రూ.3.36 లక్షలకు టోకరా
- సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వెల్లడైన నిజం
ఆమె వయసు 42 ఏళ్లు...పెళ్లయి భర్త కూడా ఉన్నాడు. భాషా పండితురాలిగా పనిచేస్తోంది. అయితేనేం అమ్మాయిగా అవతారం ఎత్తింది. డాక్టర్‌నని హోదా పెట్టుకుంది. అవే వివరాలు మ్యాట్రిమోనీలో అప్‌లోడ్ చేసి వరుడు కావాలంటూ ఆకర్షించింది. తన ఫొటో పెడితే తెలిసి పోతుందనుకుని వేరే యువతి ఫొటోను ప్రొఫైల్‌లో ఉంచింది. పెళ్లికి ఆసక్తి చూపిన యువకుడికి మాయమాటలు చెప్పి డబ్బు గుంజేసింది. డబ్బిచ్చిన వ్యక్తికి అనుమానం వచ్చి ఎంక్వయిరీ చేస్తే అసలు గుట్టు రట్టయింది. రాచకొండ సైబర్ క్రైం ఏసీపీ హరినాథ్ కథనం మేరకు వివరాలిలావున్నాయి.
ముంబయి మహానగరం వాసి సెక్టార్-28లోని నిశాంత్ మిలీనియంలో ఉంటున్న రీమా సంధు (42) భాషా శిక్షకురాలు. ఈమె భర్త పేరు సిద్ధాంత్‌సింగ్. భారత్ మ్యాట్రిమోని డిఫెన్స్ మ్యాట్రిమోని సైట్‌లో రిధిమాకల్సే పేరుతో వరుడు కావాలంటూ ఫ్రొఫైల్‌ను ఉంచింది. తెలంగాణ రాష్ట్రం మేడ్చల్ జిల్లా యాప్రాల్‌లో ఉండే విశ్రాంత ఆర్మీ కల్నల్ భూపిందర్‌సింగ్ తన కొడుకు దిల్‌ప్రీత్‌సింగ్ వివాహం కోసం ఇదే సైట్‌లో పేరు రిజిస్టర్ చేయించారు. దీంతో దిల్‌ప్రీత్ సింగ్‌కు రీమా సంధు ఫోన్ చేసింది. రిధిమాకల్సేగా పరిచయం చేసుకుంది. తాను ముంబయిలో డాక్టర్‌నని, పలు ఆస్పత్రుల్లో పనిచేస్తున్నానని తెలిపింది. ఆమె ప్రొఫైల్‌లో ఉంచిన ఫొటో నచ్చడంతో దిల్‌ప్రీత్‌సింగ్ ఆకర్షితుడయ్యాడు. ఇద్దరూ ఫోన్‌లో తరచూ మాట్లాడుకుంటూ ఉండేవారు.
కొన్నాళ్ల తర్వాత తన బామ్మను ఆస్పత్రిలో చేర్చామని, అర్జంటుగా డబ్బు అవసరమని దిల్‌ప్రీత్‌సింగ్‌కు రీమా సంధు తెలిపింది. తనకు ఉన్న ప్రవాస భారతీయురాలి ఖాతాలో డబ్బు ఉన్నా భద్రతా కారణాల రీత్యా లావాదేవీలు సాధ్యం కాకపోవడం వల్లే డబ్బుకు ఇబ్బంది ఏర్పడిందని కథ అల్లింది. అదే సమయంలో తనే గొంతుమార్చి ఆమె పిన్ని పేరుతో మరో నంబర్ నుంచి ఫోన్ చేసి ఇదే విషయాన్ని తెలియజేసింది. అప్పటికే ఆమెను పెళ్లి చేసుకునే యోచనలో ఉన్న దిల్‌ప్రీత్‌సింగ్ ఆమె మాయమాటలు నిజమేనని నమ్మాడు. ఆమె సూచించిన బ్యాంకు ఖాతాలోకి పలు దఫాలుగా రూ.3.36 లక్షలు జమ చేశాడు.
ఇది జరిగిన కొన్నాళ్ల తరువాత రిధిమాకల్సే (రీమా సంధు)ను వ్యక్తిగతంగా కలిసేందుకు దిల్‌ప్రీత్‌సింగ్ ఎన్నిసార్లు ప్రయత్నించినా ఆమె అవకాశం ఇవ్వలేదు. దీంతో అనుమానం వచ్చిన తండ్రీకొడుకులు మ్యాట్రిమోనిలో ఆమె ఇచ్చిన అడ్రస్ పట్టుకుని ముంబయి వెళ్లగా అది తప్పుడు చిరునామా అని తేలింది. దీంతో మోసపోయామని గుర్తించిన వారు సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసు దర్యాప్తులో రీమాసంధు ద్విపాత్రాభినయం, పెళ్లి మోసం బయట పడడంతో అవాక్కయ్యారు.