Rahul Gandhi: హిందూయిజం గురించి బీజేపీకి ఏమాత్రం అవగాహన లేదు: రాహుల్ గాంధీ
- ముఖ్యంగా ఉండాల్సిన గుణం వినయం
- బీజేపీ కంటే హిందూ మతం గురించి నాకు బాగా తెలుసు
- బీజేపీ నేతలకు ఘాటు సమాధానం
హిందూయిజం గురించి బీజేపీకి ఏమాత్రం అవగాహన లేదని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ విమర్శించారు. ఓటర్లను మోసగించేందుకు ‘‘ఫ్యాన్సీ డ్రెస్ హిందూయిజం’’ ప్రదర్శిస్తున్నారంటూ తనను విమర్శిస్తున్న బీజేపీ నేతలకు ఆయన ఘాటైన సమాధానమిచ్చారు. కాషాయ పార్టీ కంటే హిందూ మతం గురించి తనకు బాగానే తెలుసన్నారు.
అన్నింటికంటే ముఖ్యంగా ఉండాల్సిన గుణం వినయని రాహుల్ పేర్కొన్నారు. ఎవరైనా మాట్లాడుతున్నప్పుడు ముందు వాళ్లు చెప్పేది విని, అర్థం చేసుకోవాలనేది దీని అర్థమన్నారు. కోపంగా మాట్లాడుతున్నవాళ్లు పిచ్చివాళ్లని తాను భావించనని, అసలు వారు ఎందుకు కోపంగా ఉన్నారో అర్థం చేసుకునేందుకు ప్రయత్నిస్తానన్నారు. బీజేపీకి అసలు హిందూయిజం అంటే ఏంటో ఏమాత్రం అర్థం కాలేదని, వారికంటే హిందూయిజం గురించి తనకే బాగా తెలుసన్నారు.
కాగా ఎన్నికల నేపథ్యంలో మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినీలో ఉన్న మహాకాళేశ్వర ఆలయాన్ని రాహుల్ గాంధీ నిన్న సందర్శించారు. ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాహుల్ పూజలపై బీజేపీ నేతలు తీవ్రంగా స్పందించారు. ఓటర్లను ఆకట్టుకునేందుకే రాహుల్ హిందూత్వ నినాదాన్ని అందుకున్నారంటూ విమర్శించింది. రాహుల్ జంధ్యం ధరిస్తే ఏ ‘గోత్రానికి’ చెందిన వారో చెప్పాలంటూ ప్రశ్నించింది. ఈ వ్యాఖ్యలపై స్పందించిన రాహుల్ ఈ వ్యాఖ్యలు చేశారు.