Andhra Pradesh: కేసీఆర్ చేయించింది రాత్రిపూట ‘గ్లాస్’ సర్వే.. నేను చేయించింది మాత్రం గ్రాఫ్ సర్వే!: కాంగ్రెస్ నేత రాములు నాయక్
- అధికారంలోకి వచ్చేది మహాకూటమే
- కారుకు బ్రేకులు ఫెయిలయ్యాయి
- తెలంగాణ స్టీరింగ్ కాంగ్రెస్ చేతుల్లో
తెలంగాణలో త్వరలో జరగనున్న ఎన్నికల్లో మహాకూటమి అధికారంలోకి రాబోతుందని కాంగ్రెస్ పార్టీ నేత రాములు నాయక్ జోస్యం చెప్పారు. రాబోయే ఎన్నికల్లో టీఆర్ఎస్ 100 సీట్లలో ఘనవిజయం సాధిస్తుందని సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ అబద్ధపు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ప్రస్తుతం తెలంగాణలో ‘కారు’కు బ్రేకులు ఫెయిల్ అయ్యాయనీ, టైర్లు అన్నీ పంక్చర్ అయ్యాయని ఎద్దేవా చేశారు. తెలంగాణ ప్రభుత్వ స్టీరింగ్ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ చేతుల్లోకి వచ్చేసిందన్నారు. ఈ రోజు హైదరాబాద్ లో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.
కూకట్ పల్లి, శేరిలింగంపల్లిలో కేటీఆర్ ఊహిస్తున్నట్లు టీఆర్ఎస్ గెలిచే పరిస్థితే లేదని రాములు నాయక్ స్పష్టం చేశారు. ఒకవేళ ఈ రెండు నియోజకవర్గాల్లో టీఆర్ఎస్ గెలిస్తే చెప్పు నెత్తిన పెట్టుకుంటానని సవాల్ విసిరారు. తాను మెదక్, ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాల్లో సర్వే చేయించాననీ, ఇక్కడ మహాకూటమి మెజారిటీ సీట్లను దక్కించుకోబోతోందని జోస్యం చెప్పారు. కేసీఆర్ చేయించింది రాత్రిపూట గ్లాస్ సర్వే అనీ, తాను చేయించింది మాత్రం గ్రాఫ్ సర్వే వ్యాఖ్యానించారు.