USA: నష్టపోవడంలో జుకర్ బర్గ్ రికార్డును బ్రేక్ చేసిన జెఫ్ బెజోస్... 48 గంటల్లో రూ. 1,40,962 కోట్ల నష్టం!
- ఇంటర్నేషనల్ మార్కెట్లో అనిశ్చితి
- దారుణంగా పడిపోయిన అమెజాన్ ఈక్విటీ విలువ
- సంపదను కోల్పోతున్న బిలియనీర్లు
ప్రపంచ కుబేరుల్లో ఒకరిగా రికార్డు సృష్టించిన అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్, సంపదను కోల్పోవడంలోనూ రికార్డు సృష్టించారు. సంపదను నష్టపోవడంలో గతంలో మార్క్ జుకర్ బర్గ్ పేరిట ఉన్న రికార్డును ఆయన అధిగమించారు. గత రెండు రోజుల్లో ఆయన కంపెనీ ఈక్విటీ వాటాల విలువ దారుణంగా పడిపోవడంతో, జెఫ్ బెజోస్ సంపద 19.2 బిలియన్ డాలర్లు (సుమారు రూ. 1,40,962 కోట్లు - డాలర్ తో మారకపు విలువ రూ. 73.4181పై) తగ్గిపోయింది. ఇంటర్నేషనల్ మార్కెట్లో నెలకొన్న అనిశ్చితి కారణంగా యూఎస్ స్టాక్ మార్కెట్లో అమెజాన్ ఈక్విటీ వాటాలు భారీ నష్టాలను చవిచూశాయి.
అమెజాన్ ఈక్విటీల విలువ ఈ నెలలో భారీగా పతనమైంది. దీంతో నెలారంభంలో 167.7 బిలియన్ డాలర్లుగా ఉన్న బెజోస్ సంపద ప్రస్తుతం 128.1 బిలియన్ డాలర్లకు చేరింది. గతంలో ఈ రికార్డు ఫేస్ బుక్ కో-ఫౌండర్ మార్క్ జుకర్ బర్గ్ పేరిట ఉండేది. ఈ సంవత్సరం జూలైలో ఆయన రెండు రోజుల వ్యవధిలో 16.5 బిలియన్ డాలర్లు నష్టపోయిన సంగతి తెలిసిందే. సంస్థ ఖాతాదారుల వివరాలు చోరీకి గురయ్యాయని వార్తలు వచ్చిన సమయంలో ఇది జరిగింది. కాగా, మరో బిలియనీర్ బిల్ గేట్స్, గత రెండు రోజుల్లో 558.3 మిలియన్ డాలర్ల సంపదను నష్టపోయారు.