Sabarimala: శబరిమలకు వెళ్లాలని అమిత్ షా నిర్ణయం!

  • తన సిబ్బందిని కోరిన అమిత్ షా
  • ఇంకా సమాచారం రాలేదన్న కేరళ బీజేపీ
  • నవంబర్ 17న తెరచుకోనున్న ఆలయం

బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షా వచ్చే నెలలో శబరిమల ఆలయాన్ని సందర్శించాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. ఆలయాన్ని చూడాలని ఉందని అమిత్ షా తన సిబ్బందిని కోరినట్టు తెలుస్తుండగా, ఈ విషయంలో ఇంతవరకూ అధికారిక నిర్ణయం తీసుకోలేదని, తమకింకా సమాచారం అందలేదని కేరళ బీజేపీ నేత ఒకరు వ్యాఖ్యానించారు. కాగా, నవంబర్‌ 17 నుంచి శబరిమలలో మండల పూజల నిమిత్తం 41 రోజుల పాటు అయ్యప్ప ఆలయాన్ని తెరచివుంచుతారన్న సంగతి తెలిసిందే.

ఆలయంలోకి అన్ని వయసుల మహిళల ప్రవేశాన్ని ఆమోదిస్తూ, సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును వ్యతిరేకిస్తున్న నిరసనకారులకు బీజేపీ మద్దతిస్తుందని ఇటీవల అమిత్ షా వ్యాఖ్యానించారు కూడా. నిరసనకారులపై కేరళ సర్కారు ఉక్కుపాదం మోపుతుండటం, వేలమందిని అరెస్ట్ చేయడంపైనా ఆయన స్పందిస్తూ, రాష్ట్రంలో ఎమర్జెన్సీ పరిస్థితులు కనిపిస్తున్నాయని నిప్పులు చెరిగారు. అయ్యప్ప భక్తులపై దాడులు ఆపకుంటే, బీజేపీ కార్యకర్తలు స్వయంగా రంగంలోకి దిగుతారని ఆయన హెచ్చరించారు.

కాగా, కేరళలో పోలీసులు, ఇప్పటివరకూ 3,500 మందిి నిరసనకారులను అరెస్టు చేశారు. ఈ నెల 17 నుంచి 22 వరకూ ఆలయాన్ని తెరిచిన వేళ, సుమారు 12 మంది మహిళలు ఆలయంలోకి ప్రవేశించాలని చూసి, భక్తుల నిరసనల నడుమ విఫలమైన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News