Andhra Pradesh: జగన్ పై దాడి జరిగాక కత్తి 2 గంటలు మాయమైంది.. దీనిపై వైసీపీ నేతలను విచారించాలి!: మంత్రులు సుజన, ప్రత్తిపాటి
- వైసీపీ, బీజేపీ తప్పుడు ఆరోపణలు చేస్తున్నాయి
- ఫొటోలు, ప్లెక్సీలు మార్ఫింగ్ చేస్తున్నారు
- చంద్రబాబు, లోకేశ్ లనూ వదలలేదు
ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత జగన్ పై దాడికి పాల్పడింది తెలుగుదేశం కార్యకర్త అంటూ తప్పుడు ప్రచారం సాగుతోందని సుజయ్ కృష్ణ రంగారావు ఆరోపించారు. గత కొన్నిరోజులుగా ఓవైపు బీజేపీ, మరోవైపు వైసీపీ నాయకులు ఈ బురదజల్లే కార్యక్రమాన్ని చేస్తున్నారని విమర్శించారు. సాధారణంగా దాడికి గురైన వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేయాల్సి ఉంటుందని తెలిపారు. అయితే జగన్ ఇప్పటివరకూ పోలీసులకు ఫిర్యాదు చేయకపోవడానికి గల కారణం ఏంటని ఆయన ప్రశ్నించారు.
మరోవైపు మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు మాట్లాడుతూ.. ఫొటోల నుంచి ప్లెక్సీల ద్వారా మార్ఫింగ్ చేసే సంస్కృతికి వైసీపీ తెరలేపిందని విమర్శించారు. ఈ విషయాన్ని ఆధారాలతో సహా టీడీపీ కార్యకర్తలు బయటపెట్టారని వెల్లడించారు. జగన్ తో శ్రీనివాసరావు ఫొటోలు దిగితే, దాన్ని సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ లతో ఫొటోలు దిగినట్లు మార్ఫింగ్ చేశారని మండిపడ్డారు.
అసలు జగన్ పై దాడి జరిగిన 2 గంటల వరకూ కత్తి మాయం కావడం ఏంటని ప్రశ్నించారు. ఈ వ్యవహారంలో జగన్ తో పాటు ఉన్న వైసీపీ నేతలను విచారించాలని పుల్లారావు డిమాండ్ చేశారు. పోలీసుల విచారణలో త్వరలోనే నిజాలు బయటకు వస్తాయని వ్యాఖ్యానించారు.