Telangana: ‘తెలంగాణ’లో ఒక నెలపాటు వైన్ షాపులు, బార్లు మూసేయండి: ఆర్.కృష్ణయ్య
- ఎన్నడూ లేనివిధంగా మద్యం పంపిణీ చేస్తున్నారు
- ఎన్నికలు పూర్తయ్యే వరకూ మద్యం నిషేధించాలి
- తెలంగాణ ప్రధాన ఎన్నికల అధికారికి ఫిర్యాదు
ఎన్నికలు పూర్తయ్యే వరకూ ‘తెలంగాణ’లో మద్యం నిషేధించాలని మాజీ ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు. గతంలో ఎన్నడూ లేని విధంగా రాష్ట్రంలో మద్యం పంపిణీ చేస్తున్నారని తెలంగాణ ప్రధాన ఎన్నికల అధికారి రజత్ కుమార్ ని సచివాలయంలో కలిసి ఈ మేరకు ఫిర్యాదు చేశారు.
అనంతరం, ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఒక నెలపాటు బీరు షాపులు, వైన్ షాపులు, బార్ షాపులు బంద్ చేయాలని డిమాండ్ చేశారు. ఏ కులాలు అయితే చైతన్యవంతంగా ఉంటాయో ఆ కులాలను ప్రభుత్వాలు గుర్తిస్తాయని, వారి అభివృద్ధికి చర్యలు తీసుకుంటాయని అన్నారు. బీసీ రిజర్వేషన్లు, విద్యార్థుల బోధనా రుసుములు పూర్తిగా చెల్లించాలన్న డిమాండ్ తో నవంబర్ 4న సరూర్ నగర్ స్టేడియంలో బహిరంగ సభ నిర్వహించనున్నట్టు చెప్పారు. ఈ సభకు విద్యార్థులు, యువకులు, నిరుద్యోగులు, కుల సంఘాలు, ప్రజలు పెద్ద ఎత్తున కదలి రావాలని కోరారు. తెలంగాణలో త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఎల్బీనగర్ నియోజకవర్గం నుంచే తాను మళ్లీ పోటీ చేస్తానని స్పష్టం చేశారు.