Narendra Modi: జపాన్ ప్రధానికి విలువైన కానుకలు అందజేసిన ప్రధాని మోదీ!
- షింజో అబేకు రాతి పాత్రలు, ధురీస్ బహుమతులు
- నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ పర్యవేక్షణలో తయారీ
- జపాన్ పర్యటనలో ప్రధాని మోదీ
ద్వైపాక్షిక శిఖరాగ్ర సమావేశానికి జపాన్ వెళ్లిన భారత ప్రధాని నరేంద్ర మోదీ ఆ దేశ ప్రధాని షింజో అబేకు విలువైన వస్తువులను బహుమతులుగా ఇచ్చారు. రాజస్థాన్‌లో రోజ్ క్వార్జ్, యెల్లో క్వార్జ్‌తో తయారు చేసిన రాతి పాత్రలు, ఉత్తరప్రదేశ్ చేనేత కళాకారులు నేసిన ధురీస్‌ను అందజేశారు. అంతేకాకుండా జోధ్‌పురి సంప్రదాయ పనితీరు ఉట్టిపడే చెక్కపెట్టెను బహూకరించారు. షింజో అబేకు అందజేసిన ఈ బహుమతులను నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ పర్యవేక్షణలో తయారు చేశారు.
భారతదేశం హస్తకళలకు ప్రసిద్ధి. అందుకే ప్రధాని మోదీ ఏ దేశ పర్యటనకు వెళ్లినా హస్తకళలను ప్రోత్సహించే బహుమతులను అందజేస్తుంటారు. అందమైన రాతి పాత్రలను తయారు చేయడంలోను, విదేశాలకు ఎగుమతి చేయడంలోను గుజరాత్‌లోని ఖంబట్ ప్రాంతం ప్రఖ్యాతి చెందింది. ఈ ప్రాంతానికి చెందిన ప్రముఖ కళాకారుడు షబ్బీర్ హుస్సేన్ ఇబ్రహీం భాయ్ షేక్ రాతి పాత్రలను తయారు చేశారు. అయితే ఈ రాతి పాత్రలను నునుపుగా తయారు చేయడానికి ఎలాంటి యంత్రాలను ఉపయోగించకపోవడం విశేషం. ఉత్తరప్రదేశ్‌లోని మీర్జాపుర్ చేనేత కళాకారులు ధురీస్‌ను నేశారు. ఈ ధురీస్‌పై భారత్‌కే ప్రత్యేకమైన రంగుల ఆకృతులు అద్దారు.