KTR: టీఆర్ఎస్, టీడీపీలు కలిసుంటే బాగుంటుందని చంద్రబాబు అన్నారు.. నేను సాధ్యపడదని చెప్పాను!: కేటీఆర్

  • ఇరు రాష్ట్రాల మధ్య పలు విభేదాలు వస్తాయి
  • పొత్తు ఉంటే సమస్యలు తెగవు
  • కాంగ్రెస్, టీడీపీల పొత్తు మంచిదా? కాదా? అనేది ప్రజలే నిర్ణయిస్తారు

నందమూరి హరికృష్ణ దురదృష్టవశాత్తు చనిపోయినప్పుడు టీఆర్ఎస్ నేతలు మానవీయ కోణంలో ఎలా స్పందించారో అందరికీ తెలుసని చెప్పారు. మంత్రి జగదీష్ రెడ్డి హుటాహుటిన ఆసుపత్రికి వెళ్లారని, అక్కడ నుంచి భౌతికకాయం హైదరాబాదుకు వచ్చేంత వరకు దగ్గరే ఉన్నారని గుర్తు చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్, తాను కూడా ఆయన నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులను ఓదార్చామని తెలిపారు. అక్కడ రెండు గంటల సేపు తాము కూర్చున్నామని చెప్పారు. కుటుంబం బాధలో ఉన్నప్పుడు అండగా ఉండాలనే మానవీయ కోణంతో ఇదంతా చేశామని తెలిపారు.

ఆ సందర్భంగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు తమతో ఒక మాట చెప్పారని... టీఆర్ఎస్, టీడీపీలు కలిసి ఉంటే బాగుంటుందని సూచించారని అన్నారు. దానికి సమాధానంగా 'అది సాధ్యపడకపోవచ్చు సార్' అని తాను చెప్పానని తెలిపారు. 'ఎందుకండీ' అని చంద్రబాబు ప్రశ్నించారని... దానికి సమాధానంగా... 'సార్, మీరు ఏపీకి ముఖ్యమంత్రి. మీ అబ్బాయి ఇక్కడ లోకల్ అన్నారు. ఆ తర్వాత మీరు ఆయనను తీసుకెళ్లి మంత్రి వర్గంలో చేర్చుకున్నారు. తద్వారా మా భవిష్యత్తు అంతా ఏపీలోనే ఉంటుందనే మెసేజ్ ఇచ్చారు.

మళ్లీ మీరు తెలంగాణలో కూడా ఉండాలనుకుంటే సమస్యలు వస్తాయి. నీళ్ల విషయంలో కానీ, మరొక విషయంలో కానీ రెండు రాష్ట్రాల మధ్య విభేదాలు వస్తాయి. ఇలాంటి పరిస్థితుల్లో మనం పొత్తు పెట్టుకుంటే... ఆ సమస్యలు తెగవు. ఇలాంటి వైరుధ్యాలతో పొత్తులు కుదరవు సార్. ఇన్ని వైరుధ్యాలతో పొత్తులు కుదరవు. మీ రాష్ట్రం అక్కడుంది. మా రాష్ట్రం ఇక్కడుంది. ఎందుకు సార్, మనకు ఈ పంచాయతి?' అని అడిగానని చెప్పారు.

తెలంగాణలో కొంత మంది నాయకులు ఉన్నారని... వారికోసం తెలంగాణలో ఉండాలని ఆ సందర్భంగా చంద్రబాబు తనతో చెప్పారని కేటీఆర్ అన్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో మీరు తిరిగారని, కానీ ఫలితాలు వ్యతిరేకంగా వచ్చాయని, ప్రజలు ఇప్పుడు మరో మూడ్ లోకి వచ్చారని తాను చెప్పానని తెలిపారు. చంద్రబాబు, జగన్ లు ఇక్కడ అధికారంలోకి వచ్చే అవకాశం లేదని... టీఆర్ఎస్ అధికారంలోకి రావాలని ఇక్కడున్న రాయలసీమ, కోస్తాంధ్ర ప్రజలు కోరుకుంటున్నారని చెప్పారు. ఏపీలో మీకు మేము ఎలాంటి ఇబ్బందులు పెట్టమని, ఇక్కడ మాకు కూడా మీరు రాజకీయ చికాకులు పెట్టవద్దని చంద్రబాబును కోరానని తెలిపారు. ఆ తర్వాత కాంగ్రెస్ తో కలసి వెళ్లాలనే నిర్ణయాన్ని చంద్రబాబు తీసుకున్నారని... తాను ఆ విషయంపై చర్చకు వెళ్లదలుచుకోలేదని చెప్పారు. చంద్రబాబు నిర్ణయం మంచిదా? కాదా? అనే విషయం ప్రజలే నిర్ణయిస్తారని అన్నారు. 

  • Loading...

More Telugu News