Telangana: రద్దు.. రద్దు అంటున్న కాంగ్రెస్ పార్టీని తెలంగాణ ప్రజలు ఇవాళ వద్దు అని చెబుతున్నారు!: మంత్రి హరీశ్ రావు
- ప్రాజెక్టులను కోర్టులకు వెళ్లి అడ్డుకున్నారు
- థర్మల్ విద్యుత్ ప్లాంట్లను మూసేస్తామంటున్నారు
- టీఆర్ఎస్ ప్రభుత్వానికి మరో ఛాన్స్ ఇవ్వండి
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చేపట్టిన సాగునీటి ప్రాజెక్టులన్నింటిని కాంగ్రెస్ పార్టీ నేతలు కోర్టులకు వెళ్లి అడ్డుకుంటున్నారని టీఆర్ఎస్ నేత, మంత్రి హరీశ్ రావు విమర్శించారు. తాము అధికారంలోకి వస్తే పేద ఆడపిల్లలకు అందించే కల్యాణ్ లక్ష్మీ పథకాన్ని, ధర్మల్ విద్యుత్ ప్లాంట్లను రద్దు చేస్తామని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారని దుయ్యబట్టారు. రైతన్నలను ఆదుకునేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ తెచ్చిన రైతు బంధు పథకాన్ని, కాళేశ్వరం ప్రాజెక్టులను సైతం అడ్డుకుంటామని కాంగ్రెస్ నేతలు బెదిరిస్తున్నారని వ్యాఖ్యానించారు. ఈ రోజు సిద్దిపేటలో టీఆర్ఎస్ శ్రేణులు నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు.
ఇన్ని సంక్షేమ పథకాలను రద్దు చేస్తామంటున్న కాంగ్రెస్ పార్టీని తెలంగాణ ప్రజలే రద్దు చేయబోతున్నారని హరీశ్ రావు జోస్యం చెప్పారు. బతుకమ్మ చీరల పంపిణీని సైతం కాంగ్రెస్ నేతలు అడ్డుకున్నారని దుయ్యబట్టారు. ‘అన్ని పథకాలను రద్దు చేస్తాం. రద్దు చేస్తాం అంటున్న కాంగ్రెస్ పార్టీ మాకు వద్దు’ అని తెలంగాణ ప్రజలు మూకుమ్మడిగా చెబుతున్నారని వ్యాఖ్యానించారు. రాబోయే ఎన్నికల్లో టీఆర్ఎస్ కు మరో అవకాశం ఇవ్వాలని జిల్లా ప్రజలకు విజ్ఞప్తి చేశారు. బంగారు తెలంగాణ సాధనకు టీఆర్ఎస్ కే పట్టం కట్టాలని కోరారు.