KTR: ఏపీ ఇంటెలిజెన్స్ పోలీసులపై ఎన్నికల సంఘం చర్యలు తీసుకోవాలి: కేటీఆర్

  • విలేకరులమని తెలంగాణలో ఎన్నికల సర్వేలు చేస్తున్నారు
  • కాంగ్రెస్ నేతలను చంద్రబాబు నమ్మడం లేదు
  • రూ.500 కోట్లతో రాహుల్ తో చంద్రబాబు ఒప్పందం

ఏపీ ఇంటెలిజెన్స్ పోలీసులపై ఎన్నికల సంఘం చర్యలు తీసుకోవాలని కేటీఆర్ కోరారు. ధర్మపురిలో ఎన్నికలపై నిన్న సర్వే చేసిన ఏపీ ఇంటెలిజెన్స్ పోలీసుల వివరాలన్నీ తమ వద్ద ఉన్నాయన్నారు. కాంగ్రెస్ నేతలపై నమ్మకం లేకపోవడంతో చంద్రబాబు ఏపీ నుంచి ఇంటెలిజెన్స్ అధికారులను తెలంగాణకు పంపించారని, విలేకరులమని చెప్పిన వారిని స్థానిక యువకులు గట్టిగా ప్రశ్నించగా ఏపీ ఇంటెలిజెన్స్ పోలీసులమని వెల్లడించారని కేటీఆర్ తెలిపారు.

తెలంగాణలో పైసలు పంచడానికి చంద్రబాబు కుట్ర


తెలంగాణలో పైసలు పంచేందుకు చంద్రబాబు కుట్రపన్నారని కేటీఆర్ ఆరోపించారు. ఏపీ ఇంటెలిజెన్స్ పోలీసులతో తెలంగాణలో విచ్చలవిడిగా డబ్బు పంపిణీ చేయిస్తున్నారన్నారు. ఏపీ ప్రజల సొమ్ములతో చంద్రబాబు అధికార దుర్వినియోగం చేస్తున్నారన్నారు. అక్కడి డబ్బులతో ఇక్కడ ప్రచారం చేస్తున్నారని, రూ.500 కోట్లతో రాహుల్ తో చంద్రబాబు ఒప్పందం కుదుర్చుకున్నారని ఆరోపించారు. రాజకీయాలకు అతీతంగా ప్రతి నాయకుడి వాహనాన్ని తనిఖీ చేయాల్సిందేనని డిమాండ్ చేశారు. తమ వాహనాన్ని తనిఖీ చేసినా అభ్యంతరం లేదని తెలిపారు.

తెలంగాణలో కాంగ్రెస్, టీడీపీలకు మనుగడ లేదని, చిల్లర మల్లర రాజకీయాల కోసం పోలీసులను చంద్రబాబు పావుగా వాడుకుంటున్నారని కేటీఆర్ ఆరోపించారు. తెలంగాణ భవన్ లో మీడియాతో మాట్లాడిన కేటీఆర్ ఈ వ్యాఖ్యలు చేశారు. 

  • Loading...

More Telugu News