Cock Knife: ఆ గంట పాటు 'కోడి కత్తి' ఎక్కడ వుంది?
- కోడి కాలుకు కట్టే కత్తితో జగన్ పై దాడి
- ఆపై కత్తిని స్వాధీనం చేసుకున్న వైకాపా నేతలు
- గంట తరువాతే ప్రత్యక్షం
- పరీక్షల కోసం ల్యాబ్ కు తీసుకెళ్లినట్టు అనుమానం
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ పై విశాఖ పట్నం ఎయిర్ పోర్టు క్యాంటీన్ లో పనిచేసే శ్రీనివాస్, పందెం కోళ్ల కాళ్లకు కట్టే కత్తితో దాడి చేసిన తరువాత, ఓ గంట పాటు ఆ కత్తి మాయం కావడం సంచలనం సృష్టిస్తోంది. గురువారం మధ్యాహ్నం 12.40 గంటల సమయంలో శ్రీనివాస్ దాడికి పాల్పడగా, ఆ వెంటనే అక్కడే ఉన్న వైకాపా నేతలు, జగన్ వ్యక్తిగత భద్రతా సిబ్బంది ఆ కత్తిని లాక్కున్నారని తెలుస్తోంది. ఆపై నిందితుడిని సీఐఎస్ఎఫ్ అధికారులకు వారు అప్పగించారు. అదే సమయంలో దాడికి వాడిన కత్తిని మాత్రం వారు ఇవ్వలేదని విశ్వసనీయ సమాచారం.
ఆపై కాసేపటికి తిరిగి వచ్చిన సీఐఎస్ఎఫ్ అధికారులు దాడికి వాడిన కత్తిని ఇవ్వాలని, దానిపై వేలిముద్రలు తమకు సాక్ష్యమని చెప్పగా, గంట తరువాతనే వైకాపా నేతలు కత్తిని తిరిగి ఇచ్చారట. ఈ గంట పాటు సదరు కోడి కత్తి ఏమైందన్నదే ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్నగా తెలుస్తోంది. దాడి ఘటన జరిగిన సమయంలో వైకాపా నేతలు మళ్ల విజయ్‌ప్రసాద్, మజ్జి శ్రీనివాసరావు (బొత్స మేనల్లుడు) అక్కడే ఉన్నారు.
వీరిద్దరే కత్తిని శ్రీనివాస్ నుంచి స్వాధీనం చేసుకున్నారు. ఆ కత్తిని చూసిన తరువాత, విషం ఏమైనా పూశారేమోనన్న సందేహంతోనే, విశాఖలోని ఓ డయాగ్నస్టిక్ సెంటర్ కు దాన్ని తీసుకెళ్లిన వైకాపా నేతలు పరీక్షలు చేయించినట్టు తెలుస్తోంది. ఆ తరువాత దాన్ని ఎయిర్ పోర్టుకు తీసుకువచ్చి సీఐఎస్ఎఫ్ అధికారులకు అప్పగించారని కొందరు అంటున్నారు. దీనిపై అధికారిక సమాచారం లేకున్నా, గంట పాటు కత్తి ఏమైందన్న ప్రశ్నకు పోలీసుల వద్ద సమాచారం లేదు.