Hyderabad: స్నేహితురాలి సిమ్ దొంగిలించి రూ.96 వేలు కాజేసిన యువతి.. ఎస్సార్ నగర్ హాస్టల్‌లో ఘటన!
- సిమ్ దొంగిలించి డబ్బులు ట్రాన్స్‌ఫర్
- పోలీసుల హెచ్చరికలతో డబ్బులు వెనక్కి
- నిందితురాలి అరెస్ట్
స్నేహితురాలి సిమ్ కార్డును దొంగిలించి ఆమె బ్యాంకు ఖాతా నుంచి ఏకంగా రూ.96 వేలను కాజేసిన యువతిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్ ఎస్సార్‌నగర్ పోలీసుల కథనం ప్రకారం... గుంటూరు జిల్లా సిరిగిరిపాడుకు చెందిన కల్లం నాగజ్యోతి ఎస్సార్ నగర్, వెస్ట్ శ్రీనివాసనగర్ సమీపంలోని శివలీల హాస్టల్‌లో ఉంటూ ఉద్యోగం చేస్తోంది. అదే గదిలో కర్నూలు జిల్లా నంద్యాలకు చెందిన నాగలక్ష్మి కూడా ఉంటోంది. ఈ నెల15న రాత్రి నాగజ్యోతి నిద్రిస్తున్న సమయంలో ఆమె మొబైల్‌లోని సిమ్ కార్డును తస్కరించిన నాగలక్ష్మి అందులో పనిచేయని సిమ్‌కార్డు వేసింది.
దొంగిలించిన సిమ్‌ను మరో ఫోన్‌లో వేసిన నాగలక్ష్మి నాగజ్యోతి ఫోన్ పే ఖాతా నుంచి రూ.96 వేలను తన మిత్రుడు సురేశ్ ఖాతాకు బదిలీ చేసింది. ఆ తర్వాతి రోజు ఊరు వెళ్తున్నట్టు చెప్పి హాస్టల్ నుంచి పరారైంది. సిమ్ మారిపోవడంతో కాల్స్, మెసేజ్‌లు రావడం ఆగిపోయాయి. దీంతో అనుమానం వచ్చిన నాగజ్యోతి సిమ్‌ను చూడగా మారిపోయి ఉండడం గమనించింది.
దీంతో అనుమానం వచ్చి తన ఖాతాను పరిశీలించగా రూ.96 వేల ట్రాన్స్‌ఫర్ అయినట్టు ఉంది. వెంటనే ఎస్సార్ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సురేశ్‌కు ఫోన్ చేసి డబ్బులు వెనక్కి ఇవ్వాల్సిందిగా హెచ్చరించారు. దీంతో అతడు తిరిగి నాగజ్యోతి ఖాతాకు రూ.95 వేలను ట్రాన్స్‌ఫర్ చేశాడు. మిగతా వెయ్యి రూపాయలను స్టేషన్‌కు వచ్చి అందించాడు. అతడిచ్చిన సమాచారం మేరకు నాగలక్ష్మిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.