YSRCP: నన్ను ‘ఏ1’ అంటారా?.. వైసీపీ నాయకుల తీరుపై మండిపడ్డ చంద్రబాబు!
- నన్ను ‘ఏ1’ అని, డీజీపీని ‘ఏ2’ అంటారా?
- కేంద్రం వైఖరి కారణంగా కొత్త సమస్యలు వస్తున్నాయి
- సైబర్ సమీక్షలో చంద్రబాబు
ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ పై దాడి ఘటనలో వైసీపీ నాయకులు తమపై చేస్తున్న ఆరోపణలను ఏపీ సీఎం చంద్రబాబునాయుడు ఖండించారు. జగన్ పై దాడి ఘటనలో తనను ‘ఏ1’ అని, డీజీపీని ‘ఏ2’ అంటూ ఆరోపణలు చేస్తున్నారంటూ ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. సైబర్ సమీక్షలో భాగంగా వివిధ విభాగాలకు చెందిన పోలీస్ అధికారులతో ఈరోజు ఆయన సమీక్షించారు. ఏపీ పట్ల కేంద్రం అనుసరిస్తున్న వైఖరి కారణంగా కొత్త సమస్యలు వస్తున్నాయని మండిపడ్డారు.
కాగా, ఈ సమీక్షలో పాల్గొన్న ఇంటెలిజెన్స్ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ, కొన్ని మీడియా ఛానెళ్లు పనిగట్టుకుని తప్పుడు సమాచారాన్ని ప్రజల్లోకి తీసుకెళుతున్నాయని, ఇటువంటి ఛానెళ్లను నియంత్రించాల్సిన అవసరం ఉందని అన్నారు.
దీనిపై చంద్రబాబు స్పందిస్తూ, ప్రజలకు సరైన సమాచారం అందించాల్సిన బాధ్యత ప్రజాప్రతినిధులు, అధికారులపై ఉందని, మీడియాను సక్రమంగా వినియోగించుకుని ప్రజలకు వాస్తవాలు తెలియజేయాలని సూచించారు. నేర నియంత్రణపై గట్టి నిఘా ఉంచాలని ఆదేశించారు. సైబర్ నేరాల నియంత్రణకు, మహిళలపై లైంగికదాడులను అదుపు చేసేందుకు సాంకేతికతను వినియోగించుకోవాలని సూచించారు.