Devineni uma: ఏపీ పోలీసు యంత్రాంగానికి జగన్ క్షమాపణ చెప్పాలి: దేవినేని ఉమ

  • స్వార్థప్రయోజనాల కోసం జగన్ బాధ్యతారాహిత్య వ్యాఖ్యలు
  • ఏపీ పోలీసులను జగన్ కించపరచారు
  • ఆపరేషన్ గరుడలో ఏం చెప్పారో అదే జరుగుతోంది

ఏపీ పోలీసులపై నమ్మకం లేదంటూ వాంగ్మూలం ఇచ్చేందుకు నిరాకరించిన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌పై మంత్రి దేవినేని ఉమ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీ పోలీసులను జగన్ అవమానించారని, ఏపీ పోలీసులకు జగన్ క్షమాపణ చెప్పాలని, ఈ విషయంపై జగన్ స్పందించాలని ఆయన డిమాండ్ చేశారు.

రాష్ట్రంలో 70 వేల మందికి పైగా పోలీసులు పనిచేస్తున్నారని, రాష్ట్రంలో శాంతి భద్రతలతో పాటు, ప్రజలకు సేవలు అందిస్తున్నారన్నారు. ప్రతిపక్ష నాయకుడు జగన్‌కు ఇవ్వాల్సిన 2 ప్లస్ 2 భద్రతను పెంచామని, 14 మంది పోలీసులతో రక్షణ కల్పిస్తున్నామని అన్నారు. జెడ్ స్కేల్ ప్రొవిజన్ ఇచ్చి 14 పీఎస్‌ఓలు రెండు షిఫ్టుల్లో పనిచేస్తున్నారని, 3 వేల కిలోమీటర్ల పాదయాత్రలో పోలీసులు ప్రతిరోజూ ప్రతివాడా ఎక్కడ ఏ రోజు ఎంత అవసరమైతే అంత సహకరించారని అన్నారు.

కడపలోని జగన్ ఇంటి వద్ద కూడా సెక్యూరిటీ గార్డులు రెండు సెక్షన్ల కింద పనిచేస్తున్నారని, రాజకీయ స్వార్థప్రయోజనాల కోసం జగన్ బాధ్యతా రాహిత్యంగా మాట్లాడారని విమర్శించారు. ప్రతిపక్ష నేత అయి పక్క రాష్ట్రంలో విశ్రాంతి తీసుకుంటూ ఇంత బాధ్యతారహిత్యంగా మాట్లాడడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నానన్నారు.

ఎవరైనా ఒక నాయకుడిపై ఎవరైనా దాడి చేస్తే సెక్యూరిటీ వాళ్లు కానీ పక్కనున్న వాళ్లు కానీ వెంటనే దాడి చేస్తారు. దాడి చేసిన వ్యక్తిని పోలీసులు తీసుకెళ్లడం కళ్లకు కట్టినట్టు కనపడుతోందన్నారు. కోడి కత్తిని ఎయిర్‌పోర్టులోకి ఎవరు తీసుకెళ్లారు?. సీఐఎస్ఎఫ్ రాష్ట్ర పోలీసులకు ఎప్పుడు ఇచ్చారు? ఇన్ని గంటల ఆలస్యంగా ఎఫ్ఐఆర్ ఇవ్వడానికి కారణం ఏంటి? దెబ్బ తగిలిన వ్యక్తిని సీఐఎస్ఎఫ్ ఎందుకు విమానం ఎక్కనిచ్చారు? అనే అంశాలపై విచారణ జరుగుతుందన్నారు. ఆపరేషన్ గరుడలో ఏదైతే చెప్పారో అదే విధంగా కేంద్రప్రభుత్వం ఆదేశాల మేరకు వాళ్ల పరిధి భూభాగంలో ఈ ఘటన జరిగిందని, కోడి కత్తికి సీబీఐ, ఇంటర్‌పోల్ కావాలా? అని ఎద్దేవా చేశారు.

ఈరోజు సీబీఐ కోర్టు కేసు విచారణ కీలక దశకు చేరిందని, వాయిదా తీసుకుని రేపు ఏ కథ నడపబోతున్నారో చూద్దామన్నారు.  

  • Loading...

More Telugu News