Amaravati: హోదా కావాలని అడిగితే ఇన్ని కుట్రలా?: చంద్రబాబు నిప్పులు!
- అమరావతిలో రెండో రోజు కలెక్టర్ల సదస్సు
- ఐటీ దాడులతో వ్యాపారం దెబ్బతీయాలని వ్యూహం
- కేంద్రం పన్నాగాలను అడ్డుకుని తీరుతామన్న చంద్రబాబు
విభజన తరువాత నష్టపోయిన నవ్యాంధ్రకు ఇస్తామన్న హామీలను అమలు చేయాలని తాను డిమాండ్ చేస్తుంటే, తనపై కుట్రలు చేస్తున్నారని ఏపీ సీఎం చంద్రబాబు విమర్శించారు. ఈ ఉదయం అమరావతిలో కలెక్టర్ల సదస్సు రెండో రోజు ప్రారంభం కాగా, శాంతి భద్రతలపై సమీక్ష సందర్భంగా చంద్రబాబు మాట్లాడారు. హోదా కావాలని తాను అడుగుతుంటే, ఇన్ని దాడులు చేస్తారా? అంటూ కేంద్రాన్ని నిలదీసిన ఆయన, ఐటీ దాడులతో వ్యాపారాన్ని దెబ్బతీయాలన్నదే కేంద్రం ఆలోచనని నిప్పులు చెరిగారు. అభివృద్ధిని అడ్డుకునేందుకు కేంద్రం తనవంతు ప్రయత్నాలు చేస్తోందని, వీటిని అడ్డుకుని తీరుతామని అన్నారు.
నేరాలు జరిగినప్పుడు పోలీసులు ధైర్యంగా వ్యవహరించాలని, ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదని చంద్రబాబు అభయమిచ్చారు. తిత్లీ వంటి తుపాను సృష్టించిన బీభత్సంపైనా స్పందించని కేసీఆర్, కేటీఆర్ వంటి వారు, జగన్ పై చిన్న దాడి జరిగితే, అంతగా స్పందించడాన్ని ఎలా అర్థం చేసుకోవాలని ప్రశ్నించారు. ఈ విషయంలో గవర్నర్ కూడా అనుమానాస్పద వ్యవహార శైలినే అవలంబించారని అన్నారు. అధికారులను గవర్నర్ నేరుగా సంప్రదిస్తుంటే, ఇక తామెందుకని, ప్రభుత్వం ఉండే అవసరం ఏంటని నిలదీశారు.