fake notes: లక్షా తొంభై వేల రూపాయల నకిలీ నోట్లిచ్చి బంగారం కొనుగోలు!
- నగల వర్తకుడికి టోకరా ఇచ్చిన కిలాడీ దంపతులు
- పంజాబ్ లోని లూథియానాలో వెలుగు చూసిన ఘటన
- కారు నంబరు ప్లేటు తొలగించి దుకాణానికి రాక
దర్జాగా కారులో వచ్చారు...దాదాపు రెండు లక్షల రూపాయల బంగారు ఆభరణాలు కొన్నారు...అనంతరం నకిలీ నోట్లిచ్చి నగలు తీసుకుని వెళ్లిపోయారు. వారు వెళ్ళాక అవి నకిలీ నోట్లని గుర్తించడంతో లబోదిబోమనడం వ్యాపారి వంతయింది. పంజాబ్ రాష్ట్రం లూథియానాలో వెలుగు చూసిన ఈ ఘటనకు సంబంధించి వివరాలివి.
లూధియానాలోని శ్యాంసుందర్‌వర్మ నగల దుకాణానికి ఓ జంట కారులో వచ్చింది. 56 గ్రాముల బంగారు ఆభరణాలు కొనుగోలు చేశారు. ఇందుకుగాను లక్షా 90 వేల రూపాయల నగదు ఇచ్చారు. వారు వెళ్లిపోయాక చూడగా నోట్లపై రిజర్వ్ బ్యాంక్‌కు బదులు ఎంటర్‌ట్రైన్‌మెంట్ బ్యాంక్ అని ఉంది. అవి నకిలీనోట్లని, మోసపోయానని గుర్తించిన శ్యాంసుందర్ వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయగా వారు వచ్చి సీసీ టీవీ పుటేజీ పరిశీలించారు. దంపతులు వచ్చిన కారు నంబరు ప్లేటు తొలగించి ఉన్నట్లు అందులో గుర్తించారు. దీంతో వారు పక్కా ప్రణాళికతోనే వచ్చారని అర్థమై నిందితుల కోసం గాలిస్తున్నారు.