Andhra Pradesh: ఏపీలో వచ్చే జనవరికల్లా 10 లక్షల ఇళ్లను నిర్మిస్తాం.. కేంద్రం సహకరించడం లేదు!: మంత్రి కాల్వ శ్రీనివాసులు

  • ఇళ్ల నిర్మాణం శరవేగంగా సాగుతోంది
  • కేంద్ర నిబంధనలు అడ్డంకిగా మారాయి
  • ఎస్సీ,ఎస్టీలకు రూ.50 వేలు ఎక్కువ ఇస్తున్నాం

ఆంధ్రప్రదేశ్ లో సామాన్య, పేద ప్రజల కోసం చేపడుతున్న పక్కా ఇళ్ల నిర్మాణం శరవేగంగా సాగుతోందని రాష్ట్ర గృహనిర్మాణ శాఖ మంత్రి కాల్వ శ్రీనివాసులు తెలిపారు. రాష్ట్రంలోని 13 లక్షల మంది నిరుపేదలకు ఇళ్లను అందజేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని వెల్లడించారు. దక్షిణ భారతంలో ఏపీలోనే ఎక్కువ ఇళ్లను నిర్మిస్తున్నామని పేర్కొన్నారు. రాష్ట్రంలో 13 లక్షల ఇళ్ల నిర్మాణానికి రూ.19,000 కోట్లు ఖర్చు అవుతుందని మంత్రి అన్నారు. ఈ రోజు విజయవాడలో పర్యటన సందర్భంగా మంత్రి మీడియాతో మాట్లాడారు.

దాదాపు 6.88 లక్షల పక్కా ఇళ్ల నిర్మాణం ఇప్పటికే పూర్తి కావొచ్చిందని కాల్వ శ్రీనివాసులు తెలిపారు. అయితే కేంద్రం పెట్టిన కఠిన నిబంధనల కారణంగా లబ్ధిదారుల ఎంపికలో ప్రతిబంధకాలు ఎదురవుతున్నాయని వెల్లడించారు. వచ్చే జనవరి నాటికి ప్రజలకు 10 లక్షల పక్కా ఇళ్లను అందజేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని మంత్రి పేర్కొన్నారు. మిగతావారితో పోల్చుకుంటే ఎస్సీ,ఎస్టీ సామాజికవర్గ ప్రజలకు ఇళ్ల నిర్మాణం కోసం రూ.50 వేలు అదనంగా ఇస్తున్నామని గుర్తుచేశారు. రాష్ట్రంలో పేదలకు ఇళ్ల నిర్మాణానికి కేంద్రం సహకరించడం లేదని ఆరోపించారు.

  • Loading...

More Telugu News