Telugudesam: తెలంగాణలో తెలుగుదేశం పోటీ చేయబోయే సీట్లివే!
- టీడీపీకి 15 స్థానాలు ఇచ్చేందుకు కాంగ్రెస్ రెడీ
- గెలిచే స్థానాలనే అడగాలని సూచించిన చంద్రబాబు
- నాలుగైదు సీట్లలో ఇంకా అస్పష్టత
తప్పకుండా గెలిచే స్థానాల్లో మాత్రమే పోటీ చేస్తామని, పొత్తు విషయంలో పట్టువిడుపులు ఉండాలని అధినేత చంద్రబాబు ఇచ్చిన సలహా సూచనలతో తెలంగాణ టీడీపీ నేతలు కొంతమేరకు తగ్గగా, మహాకూటమిలో టీడీపీకి 15 స్థానాలు ఖరారైనట్టు తెలుస్తోంది. ఇక 2014లో తమ పార్టీ అభ్యర్థులు విజయం సాధించిన అన్ని స్థానాలనూ టీడీపీ కోరుకుంటోంది. విశ్వసనీయ సమాచారం ప్రకారం, మహా కూటమిలో భాగంగా, ఉప్పల్, ఎల్బీనగర్, కూకట్‌పల్లి, శేరిలింగంపల్లి, రాజేంద్రనగర్, మహేశ్వరం, కోరుట్ల, సత్తుపల్లి టికెట్లు టీడీపీకి దక్కనున్నాయి.
ఇక ఎల్ రమణ కోరుకుంటే కోరుట్ల టిక్కెట్ కూడా టీడీపీకి ఇచ్చేందుకు కాంగ్రెస్ సిద్ధమైంది. తమకు రావాల్సిన మిగతా స్థానాల్లో కోడాడ, మహబూబ్ నగర్, దేవరకద్రలను ఆ పార్టీ కోరుతున్నట్టు సమాచారం. సనత్ నగర్ ను కూడా టీడీపీ కోరుకుంటున్నప్పటికీ, కాంగ్రెస్ నేత మర్రి శశిధర్‌రెడ్డి అక్కడి నుంచి బరిలో దిగనున్నందున, దానికి బదులుగా సికింద్రాబాద్ ఇవ్వాలని తెలుగుదేశం కోరినట్టు తెలుస్తోంది.
వీటితో పాటు ముషీరాబాద్, ఖైరతాబాద్ స్థానాలు కూడా తెలుగుదేశం ఖాతాలోకే వెళ్లినట్టు తెలుస్తోంది. మక్తల్, కుత్బుల్లాపూర్ సీట్లలోనూ తాము పోటీ చేసేందుకు సిద్ధమని, బలమైన అభ్యర్థులున్నారని మహాకూటమి నేతలకు ఎల్ రమణ చెప్పినట్టు తెలుస్తోంది. ఖమ్మం అసెంబ్లీ స్థానంలో నామా నాగేశ్వరరావు పోటీకి సిద్ధపడితే, అది కూడా ఇవ్వాలని కోరగా, కాంగ్రెస్ సానుకూలంగా స్పందించినట్టు సమాచారం.