kcr: కేసీఆర్ హామీలన్నీ నకిలీవే!: ఉత్తమ్ కుమార్ రెడ్డి
- విద్యార్థులను కేసీఆర్, కేటీఆర్ లు మోసం చేశారు
- తండ్రీకొడుకులు మోసగాళ్లు, అబద్ధాలకోర్లు
- డిసెంబర్ 12న తెలంగాణలో మా ప్రభుత్వం ఖాయం
కేసీఆర్ తన మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలన్నీ నకిలీవేనని టీ-పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి విమర్శించారు. హైదరాబాద్ లోని గాంధీ భవన్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, యూనివర్శిటీ విద్యార్థులు కాంగ్రెస్ పార్టీలో చేరడం చాలా సంతోషమని, వారికి స్వాగతం పలుకుతున్నామని అన్నారు.
విద్యార్థులు, యువతను కేసీఆర్, కేటీఆర్ లు మోసం, దగా చేశారని, వారికి పూర్తిగా అబద్ధాలు చెప్పారని ఆరోపించారు. తండ్రీకొడుకులు మోసగాళ్లు, అబద్ధాలకోర్లని విరుచుకుపడ్డారు. ‘నిరుద్యోగ భృతి’ ఇస్తామని గతంలో తాను ఇచ్చిన హామీని హేళన చేసిన కేసీఆర్, కేటీఆర్ లు విమర్శించారని, తామిచ్చిన ఆ హామీ వీలుకాదని చెప్పిన కేసీఆర్ ఇప్పుడు తన మేనిఫెస్టోలో అదే హామీని ఉంచారని, తెలంగాణ యువతను ఆయన అవమానపరుస్తున్నారని దుయ్యబట్టారు.
డిసెంబర్ 7న జరిగే పోలింగ్ లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించబోతోందని, డిసెంబర్ 12న తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడనుందని ధీమా వ్యక్తం చేశారు. తమ ప్రభుత్వం ఏర్పడగానే మొదటి సంవత్సరంలో ప్రభుత్వ, ప్రభుత్వ రంగ సంస్థల్లో లక్ష ఉద్యోగాలు కల్పించడమే ప్రధాన లక్ష్యమని అన్నారు. ఈ లక్ష ఉద్యోగాల్లో ఇరవై వేల ఉద్యోగాలు మెగా డీఎస్సీ నిర్వహించి టీచర్ల పోస్టులను భర్తీ చేస్తామని స్పష్టం చేశారు.